జ్వరం.. భారం (నల్గొండ)

వర్షాలు కురుస్తుండటం, పారిశుధ్యం లేకపోవడంతో మలేరియా డెంగీ, చికున్‌ గున్యా, డయేరియా, ఫైలేరియా, మెదడు వాపు వంటి సీజనల్‌ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జ్వర బాధితులు అధికంగా ఉంటున్నారు. దీనిని ఆసరా చేసుకొని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వాహకులు బాధితుల నుంచి రక్త పరీక్షల పేరుతో అధికంగా వసూళ్లు చేస్తున్నారు.
జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు 645 ఉన్నాయి. ఇది వైద్య ఆరోగ్య శాఖ లెక్క మాత్రమే. లెక్కల్లోకి రానివి మరో వంద వరకు ఉంటాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొందినవి కేవలం 289 మాత్రమే ఉన్నాయి. మరో 39 ఇటీవల రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా 30 వరకు పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలో ఎక్కడైనా జ్వర బాధితులు ప్రైవేటు ఆసుపత్రి మెట్లు ఎక్కితే చాలు వైద్యుడి ఫీజు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి వ్యాధికి ముందు పరీక్షల పేరుతో రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు తీసుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క పరీక్ష కేంద్రంలో ధరల పట్టిక ఏర్పాటు చేయలేదు. కొంత మంది డెంగీ లక్షణాలు ఉన్నాయంటూ తాత్కాలిక పరీక్షలు చేసి రూ.వేల కొద్ది వసూలు చేయడంతోపాటు తమకు అనుకూలంగా ఉండే హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు పంపుతున్నారు.జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో మలేరియా బాధితులు 283 మంది, డెంగీ బాధితులు 262 మంది ఉన్నారు. వీరిలో చని పోయినవారు 11 మంది. చికున్‌ గున్యా బాధితులు 299 మంది ఉండగా, డయేరియా బాధితులు 6,520 మంది వరకు ఉన్నారు. వీరితో పాటు చర్మవ్యాధులకు గురైనవారు 6,343 మంది ఉన్నారు.
జిల్లాలో దేవరకొండ, చందంపేట, పెద్దవూర మండలం చలకుర్తి, డిండి మండల కేంద్రం, మేళ్లచెర్వు మండల కేంద్రం, రామాపురం గ్రామాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. మిర్యాలగూడ మండలం ఆళ్లగడప, తుంగపాడు, గూడూరు, మునుగోడు మండలం పలివెల, చండూరు మండలం శిర్దెపల్లి, కస్తాల, తుమ్మలపల్లి, నల్గొండ పట్టణంలో పాతబస్తీ, రిక్షాపుల్లర్స్‌ కాలనీ, లెప్రసీకాలనీ, శాంతినగర్‌ ప్రాంతాలతోపాటు మరి కొన్ని ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *