పంటకు సెగ

వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు గడిచిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంపై రైతులు ఆందోళనలో కూరుకుపోయారు. ఇక భూగర్భజల మట్టాల పెరుగదలా మెరుగుపడకపోవడంతో వారిలో ఆవేదన మరింతగా పెరిగిపోయింది. ఇటీవలిగా వాతావరణం మబ్బులమయం అవుతున్నా చెప్పుకోతగ్గ వర్షం మాత్రం కురవడంలేదు. దీంతో వ్యవసాయక్షేత్రాల్లో పైరు వాడిపోతోంది. నాగర్‌కర్నూలు జిల్లాలోనూ ఈ సమస్య అధికంగానే ఉంది. వానజాడ లేకపోవడంతో రైతాంగం మొత్తం దిగాలులో పడిన పరిస్థితి నెలకొంది. నాగర్‌కర్నూలులోనే కాక ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కరవుఛాయలు పరచుకుంటున్న పరిస్థితి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఏడు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏడు, జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు, వనపర్తి జిల్లాలో ఒకటి ప్రాంతాలు ప్రమాదకర స్థాయికి చేరినట్లు రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుల్లోకి భూగర్భజలాలు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరో 30 ప్రాంతాలు ప్రమాదకర పరిస్థితికి దగ్గరలో ఉన్నాయని అంటున్నారు. మరో వారం రోజులు వర్షాలు లేకుండా ఎండలు కొనసాగితే మాత్రం ఉమ్మడి జిల్లాకు కరవు ముప్పు వచ్చినట్లే అని చెప్తున్నారు. ఇదిలాఉంటే పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయి. దీంతో అక్కడి రైతులు నీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. ఎన్ని మీటర్ల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవడంతో ఎండిపోతున్న పంటను చూసుకుని అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడకపోతే మిగతా ప్రాంతాలు కూడా కరవు బారినపడాల్సి ఉంటుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గతేడాది కూడా వర్షాలు సరిగా కురవలేదు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండడంతో రైతుల్లో ఆవేదన గూడుకట్టుకుంది. జూన్, జులై మొదటివారాల్లో వానలు మురిపించడంతో అంతా హుషారుగా విత్తనాలు చల్లుకుని పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం వానలు మొఖం చాటేయడంతో పంటలు ఎలా కాపాడుకోవాలో తెలీక సతమతమవుతున్నారు.

వర్షాభావ పరిస్థితులతో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గతేడాది జులైలో ఉన్న భూగర్భజలాలకు ఈ ఏడాది జులై నెలతో పోల్చితే వాటి నిల్వలు వేగంగా పడిపోతున్నట్లు భూగర్భజలవనరుల శాఖ అధికారులు కూడా గుర్తించారు. అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో గతేడాది జులైలో 25.02 మీటర్ల లోతులో నీటి జాడను గుర్తించారు. అయితే అది ఈ ఏడాది జులై చివరినాటికి 28.52 మీటర్లకు పడిపోవడం హెచ్చరికలాంటిదే. ఇక నాగర్‌కర్నూలులో అయితే 22.57 మీటర్ల నుంచి 25.56 మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. వానలు లేకపోవడం, పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో పలు మండలాల్లో పొలాలు వాడిపోతున్నాయి. వర్షాలు పడకపోతే పశువులకు మేపడానికే ఇవి ఉపయోగపడుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి పథకాలు ఉండటంతో కొన్ని ప్రాంతాల రైతులు భరోసాతో ఉన్నప్పటికీ నీటి కొరత వస్తే మాత్రం సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళన వారినీ వెన్నాడుతోంది. ఏదేమైనా ఉమ్మడి పాలమూరు రైతులు వర్షాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా సరిపడా వర్షాలు లేకపోవడంతోనే నీటి సమస్య అధికంగా ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంటున్నారు. నీటిని భూమిలోకి ఇంకించే ప్రక్రియను రైతులు నిరంతరం చేపడితే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *