కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌లతోనే నేను బాగా ఆడుతున్నా..అంబటి

ఈ ఏడాది ఐపీఎల్‌లో మన తెలుగు ఆటగాడు అంబటి రాయుడు అదరగొట్టిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడిన రాయుడు అద్భుతంగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 602 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ధోని నమ్మకాన్ని నిలబెడుతూ బ్యాటింగ్‌లో రాణించి.. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తాజాగా అతడు తన సక్సెస్ సీక్రెట్ గురించి వెల్లడించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ బ్యాట్ తీసుకోవడమే తనకు కలిసొచ్చిందని చెప్పాడు.

ఐపీఎల్‌ మధ్యలో ‘క్విక్‌ హీల్‌ భజ్జీ బ్లాస్ట్‌ షో’లో రాయుడు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘కోహ్లీ నుంచి ఏటా ఒక క్రికెట్‌ బ్యాట్‌ తీసుకుంటా.. ఇది నా ఆనవాయితీ. ఆ బ్యాట్‌ నాకు ఎంతో కలిసి వస్తోంది’ అని చెప్పుకొచ్చాడు.

‘కోహ్లీ నుంచి తీసుకున్న ఆ బ్యాట్‌లతోనే నేను టోర్నీలు ఆడుతున్నా. మంచి ప్రదర్శన చేయగలుగుతున్నా. కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌లు నాకు ఎంతో కలిసి వస్తున్నాయి’ అని చెప్పుకొచ్చాడు హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు. ‘కోహ్లీ ఇచ్చిన బ్యాట్‌లతోనే నేను బాగా ఆడుతున్నానన్న విషయం అతడికి కూడా తెలిసిపోయినట్లుంది. అందుకే ఈసారి తిట్టుకుంటూ నాకు బ్యాట్‌ ఇచ్చాడు’ అంటూ చమత్కరించాడు.

‘ఐపీఎల్‌లో ఆ బ్యాట్‌తోనే ఆడా.. ‌అందుకే బాగా ఆడానేమో’ అంటూ నవ్వులు చిందించాడు రాయుడు. ఐపీఎల్‌లో రాణించడమే కాకుండా.. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌ తరఫున మంచి ప్రదర్శన చేసిన రాయుడుకు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టులో బీసీసీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *