ఏపీకి సునీల్ దేవధర్ మార్క్ కనిపిస్తుందా

భారతీయ జనతా పార్టీ ఏపీ విభాగానికి సంబంధించి నూతన బాధ్యులు నియమితం కావడం ఆసక్తిదాయకంగా మారింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఏపీని మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ గ్యాప్ లేకుండా ప్రచారం చేస్తోంది. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి సాగిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అన్ని విషయాల్లోనూ కమలం పార్టీని దోషిగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కమలం పార్టీ కొంత ఎదురుదాడి అయితే చేస్తోంది. ప్రత్యేకహోదాను తెలుగుదేశం అధినేత చంద్రబాబే గతంలో వద్దన్నారని కమలనాథులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏపీ బీజేపీకి కొత్త ఇన్‌చార్జిలు వస్తున్నారు. ప్రధాన ఇన్‌చార్జిగా కేరళ బీజేపీ నేత మురళీధరన్‌ను నియమించారు. ఈయన కాదు కానీ, సహాయ ఇన్‌చార్జిగా నియమితం అయిన సునీల్ దేవధర్ మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఇది వరకూ ఈయన ఈ తరహాలో బాధ్యతలు చేపట్టిన రాష్ట్రంలో బీజేపీ సంచలన విజయం సాధించింది. అసలు డిపాజిట్లు రావడమే ఘనం అనుకున్న రాష్ట్రంలో అధికారాన్ని సాధించింది. అదే త్రిపుర! ఈ రాష్ట్రంలో కమలం పార్టీ కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టి అధికారాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ విజయంలో దేవధర్‌కు కూడా కొంత భాగస్వామ్యం ఉంది. ఈయన మహారాష్ట్రకు చెందిన నేతే అయినా.. త్రిపుర ఎన్నికల్లో చాలా గట్టిగా పని చేశారు. ఎన్నికలకు చాలా ముందుగానే త్రిపురకు చేరుకున్నారు, అక్కడే మకాం వేశారీయన. త్రిపురలో ప్రజలు మాట్లాడుకునే భాషను నేర్చుకున్నారు. అక్కడి ప్రజలతో మమేకం అయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అహర్నిశలూ ప్రయత్నాలు చేశారు. అలాంటి నేపథ్యం ఉంది దేవధర్‌కు. త్రిపురలో మ్యాజిక్ చేసిన ఈయన ఏపీలో కూడా మ్యాజిక్ చేస్తారో, చేయలేరో కానీ.. బాగా కష్టపడి పనిచేసే నేత ఏపీ బీజేపీకి సహాయ ఇన్‌చార్జి బాధ్యతల్లోకి వస్తున్నారని మాత్రం స్పష్టం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *