వచ్చే ఎన్నికల్లో పొత్తులుండవ్!… జగన్

వచ్చే ఎడాది జరగనున్న ఎన్నికల్లో తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికలకు ముందు తాము ఏ పార్టీతోనూ కలవబోమన్న ఆయన, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చే వారికి మాత్రం మద్దతు తెలుపుతామన్నారు.

గత ఎన్నికల్లో తాము కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు తాను అనుభవజ్ఞుడినని చెప్పుకోవడం, మోదీ హవా, పవన్ కల్యాణ్ మద్దతుతో ఆయన గద్దెనెక్కారని అన్నారు. ముఖ్యంగా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తమ ఓటమికి అవే కారణాలయ్యాయని అన్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి వేరుగా ఉందని, చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలు గుర్తించారని జగన్ అన్నారు.

తాను అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకువస్తానని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము మాత్రమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే తాను పాదయాత్రపైనే దృష్టి పెట్టానని, ముందస్తు ఎన్నికల గురించి ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉందని, ఒకరితో పొత్తు కోసం, మద్దతు కోసం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని జగన్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com