అధ్వాన్న విద్య (మెదక్)

జిల్లాలో విద్యావ్యవస్థ అధ్నాన్నంగా ఉంది. ఇప్పటికే మండల విద్యాధికారుల కొరతతో పర్యవేక్షణ కొరవడింది. దీనికితోడు ప్రధానోపాధ్యాయులు తగిన సంఖ్యలో లేకపోవడంతో మరింత ప్రభావం పడే అవకాశం ఉంది. జిల్లాలో 623 ప్రాథమిక, 132 ప్రాథమికోన్నత, 143 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చిస్తోంది. నూతన విద్యా విధానాలను, ప్రణాళికలను రూపొందిస్తోంది. క్షేత్రస్థాయిలో వాటిని పర్యవేక్షించేవారే లేకపోవడంతో విద్యావ్యవస్థ తీరు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 20 మండలాలు ఉండగా ప్రస్తుతం తొమ్మిది మందే విద్యాధికారులు ఉన్నారు. పైగా వారిలో కొందరు ఒకటి నుంచి మూడు మండలాలకు అదనపు బాధ్యతలు మోస్తుండటం గమనార్హం. మరోవైపు జిల్లాలో 52 ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు లేకపోవడం గమనార్హం.
గతంలో ఈ పాఠశాలల్లో ఉన్నవారు ఇతరప్రాంతాలకు బదిలీకావడం, పదవీ విరమణ పొందడంతో ఆ స్థానాల్లో నూతనంగా ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎఫ్‌ఏసీలుగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలోని ఉపాధ్యాయుల జీతభత్యాలు, మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డుల నిర్వహణతో పాటు విద్యాసంస్థల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ముందస్తుగా ఇచ్చే శిక్షణకు హాజరవ్వాల్సి ఉంటుంది. సీసీఈ విధానంలో పరీక్షల నిర్వహణ, పాఠశాల సముదాయ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. స్వచ్ఛభారత్, హరితహారం కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. అదనపు పనుల కారణంగా నిత్యం తరగతులకు హాజరయ్యే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.
పాఠశాలల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయులను నియమించడానికి ప్రత్యేకంగా టీఆర్టీ నిర్వహించి ఉపాధ్యాయ ఫలితాలు వెలువరించారు. నేటికీ నియామకాలపై స్పష్టత రాకపోవడంతో ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్టుల బోధనకు విద్యావలంటీర్లను నియమించారు. మండలాల్లో పర్యవేక్షణాధికారులతో పాటు ప్రధానోపాధ్యాయులు లేకుండా పోయారు. దీంతో పదో తరగతి విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు ఉపాధ్యాయులు అంటున్నారు. ఖాళీల నేపథ్యంలోనే 2017-18 సంవత్సరంలో వెలువడిన పదో తరగతి ఫలితాలు తల్లిదండ్రులకు నిరాశను మిగిల్చాయి. 2016-17లో 91.16 శాతంతో 7వ స్థానంలో నిలవగా, 2017-18లో 90.08 శాతంతో 9వ స్థానానికి పడిపోయింది. పాఠశాలలపై ప్రత్యేక పర్యవేక్షణ కొరవడడంతోనే ఫలితాల్లో వెనకబడిందనే ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com