కరుణానిధి కన్నీటి వీడ్కోలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్న మోదీ, అక్కడి నుంచి కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌కు వెళ్లి, పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్ర కన్నుమూశారు. మరణ వార్త తెలియగానే ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. దేశం అత్యంత సీనియర్‌ నేతను కోల్పోయిందని అన్నారు. కరుణానిధి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆలోచనాపరుడు, మాస్‌ లీడర్‌, గొప్ప రచయితను మనం కోల్పోమని అన్నారు. ప్రజా సంక్షేమం కోసమే కరుణ తన జీవితాన్ని అంకింతం చేశారని, ప్రాంతీయ అభివృద్ధి కోసమే కాకుండా జాతీయ పురోగతికి ఆయన ఎంతో కృషి చేశారని కితాబిచ్చారు. తమిళుల సంక్షేమానికి కట్టుబడి, వారి గొంతును ఆయన సమర్థంగా వినిపించారని, అలాంటి వ్యక్తిని పలు సందర్భాల్లో కలుసుకునే అవకాశం నాకు కలిగిందని ట్వీట్ చేశారు.
కరుణానిధి తనకు తండ్రి లాంటి వారని, ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటును మిగిల్చిందని కాంగ్రెస్‌ నాయకురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. కరుణానిధి మృతికి నివాళులర్పిస్తూ స్టాలిన్‌కు ఆమె ఈ మేరకు లేఖ రాశారు. ‘కళైంగర్’ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని సోనియా లేఖలో పేర్కొన్నారు. ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనిదని, దాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని తెలిపారు. ఆయన తనకు తండ్రి లాంటి వారని, కరుణ‌ వంటి నాయకుడిని మళ్లీ మనం చూడలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కరుణానిధి నాయకత్వం లేకపోవడం దేశానికి తీరని లోటు అని సోనియా తన లేఖలో పేర్కొన్నారు. తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లోను ఆయన నాయకత్వ సేవలను ఎనలేనివని, సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి, తమిళుల సంక్షేమం మరీ ముఖ్యంగా నిరుపేదల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కరుణానిధిని కొనియాడారు. కరుణానిధి రాజకీయ నేతగానే కాకుండా.. గొప్ప రచయితగా కూడా కళారంగానికి విశేషసేవలు అందించారని సోనియాగాంధీ లేఖలో వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ కూడా కరుణానిధి మృతికి సంతాపం తెలియజేస్తూ స్టాలిన్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఆయనకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *