విశాఖ నాడి…ఎవరికి జోడి

0

విశాఖ నగరం ఓ మినీ భారతంగా చెప్పుకోవాలి. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. దాదాపుగా పాతిక లక్షల జనాభా కలిగిన ఈ మెట్రో సిటీ ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది. ఇక్కడ జనం పోరాటాలకు దూరం, కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. సమయం వచ్చినపుడు ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూంటారు.విశాఖ సకల భాషల సమ్మేళంగా చెప్పుకోవాలి. ఇక్కడ మహారాష్ట్ర, రాజస్థాన్, డిల్లీ, బెంగాల్, బీహార్, చెన్నై, బెంగళూర్ ఇలా అన్ని చోట్ల నుంచి వచ్చిన జనం ఎక్కువగా కనిపిస్తారు. ఉపాధి కోసం, వ్యాపారం నిమిత్తం విశాఖకు వచ్చిన వారంతా ఇక్కడ స్థిర పడిపోయారు. ఇక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇక్కడ చాలా ఎక్కువ, అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా అధికంగానే ఉన్నాయి. వీటిలో పనిచేసే వారంతా పాలకుల విధానాలను నిశితంగా గమనిస్తూంటారు.గుజరాత్ కి చెందిన మోడీకి ఉత్తరాది ఓటర్లు ఎక్కువగా ఉండే విశాఖలో 2014లో మంచి మద్దతు లభించింది. ఆ పార్టీకి చెందిన కంభంపాటి హరిబాబు అనూహ్యంగా మంచి మెజారిటీతో ఎంపీ అయిపోయారు. వారికి విశాఖ తటస్థ జనం కూడా అండగా నిలవడంతో గెలుపు సునాయాసమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పార్టీలకు ఓటు వేయడమే తెలుసు. స్థానిక పార్టీలను ఎపుడో తప్ప వారు పెద్దగా పట్టించుకోరు.ఈసారి రాజకీయం మారింది. బీజేపీ పట్ల నమ్మకం సడలిపోయిన సందర్భంలో కాంగ్రెస్ సైతం పెద్దగా పుంజుకోలేదు. రేపటి ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియని స్థితిలో విశాఖ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందన్నది చూడాలి. కాంగ్రెస్, టీడీపీ పొత్తు లో భాగంగా ఉమ్మడి అభ్యర్ధిని గెలిపిస్తారా లేక వైసీపీ నిలబెట్టిన వారికి పట్టం కడటారా అన్నది ఆసక్తికరమే. అయితే అత్యధిక సంఖ్యలో ఉన్న ఉత్తరాది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీదే విజయం అని అంటున్నారు.

Share.

About Author

Leave A Reply