క్వారీల అక్రమాలపై కొరడా

కృష్ణా జిల్లాలో క్వారీల అక్రమాలపై అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించనుంది. ప్రత్యేక బృందాలు ప్రతి క్వారీని క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. జిల్లాలోని అన్ని క్వారీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలో విజయవాడ, నందిగామ డివిజన్ల పరిధిలో సుమారు 300 క్వారీలకు అనుమతులు ఇచ్చారు. విజయవాడ డివిజను పరిధిలో ఒకరు, నందిగామ డివిజను పరిధిలో గనుల శాఖ నుంచి ఒక సహాయ సంచాలకులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం క్వారీల్లో పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు. 15 రోజుల్లో నివేదికలు అందజేయనున్నామని గనులశాఖ ఏడీ సుబ్రహ్మణ్యేశ్వరరావు చెప్పారుఇటీవల జరిగిన పరిణామాలతో జిల్లాలో క్వారీలపై తనిఖీలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. గుంటూరు జిల్లాలో క్వారీల తవ్వకాల్లో అక్రమాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. క్వారీల్లో ప్రధానంగా నిబంధనల అమలు, రక్షణ చర్యలు తదితర అంశాలపై బృందాలు తనిఖీలు చేస్తాయి. దీనిలో గనులు, రెవెన్యూ, పోలీసు, కాలుష్యనియంత్రణ మండలి ప్రతినిధులు ఉంటారు. డివిజను స్థాయిలో గనుల శాఖ సహాయ సంచాలకులు, డీఎస్పీ, ఆర్‌డీఓ, కాలుష్యనియంత్రణ మండలి ఈఈ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్, తహసీల్దార్‌, గనుల శాఖ నుంచి సహాయ జియాలజిస్టు, పీసీబీ ప్రతినిధి ఉంటారు. జిల్లాలో మొత్తం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. క్వారీ లీజులు ఎవరి పేరు మీద ఉన్నాయి.. ఎవరి నిర్వహణలో ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తారు. బినామీ పేర్లమీద ఉంటే వెంటనే నోటీసులు ఇస్తారు. 15 రోజులు గడువు ఇస్తారు. అదేవిధంగా పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు..? దీనికి అనుమతలు ఉన్నాయా? అనేది చూస్తారు. ఆక్రమణలు, వీటిలో తేడాలు, కార్మికుల భద్రత, లిన్‌ (లేబర్‌ ఇండెక్సు నెంబరు) గ్రూపు ఇన్స్యూరెన్సు అమలు పరిశీలించనున్నారు. చాలా క్వారీలకు పర్యావరణ అనుమతులు లేవు. వీటి సరిహద్దులను జియోమ్యాపింగ్‌తో పరిశీలిస్తారు. కంకర తవ్వకాలు, రాయల్టీ చెల్లింపులు సంబంధించిన అంశాలను పరిశీలన చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com