ప్రాజెక్టుకు నీళ్లు చేరితే ఆయకట్టుకు నీటి విడుదల నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీళ్లు చేరితే ఆయకట్టుకు నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రాజెక్టులోకి నీటి రాక బాగా తగ్గిందన్నారు. ప్రాజెక్టులోని 15 టీఎంసీలు.. తాగునీరు, డెడ్‌స్టోరేజీ, ఆవిరి నష్టాలకే సరిపోతాయన్నారు. పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి రైతులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. మంత్రి పోచారం, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… వచ్చే వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని అధికారులకు సూచించారు. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల పరిధి రైతుల అవసరాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుకు నీళ్లు చేరితే ఆయకట్టుకు నీటి విడుదలకు ప్రభుత్వం సిద్ధమని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితిని ప్రజాప్రతినిధులతో అంచనా వేస్తున్నామని చెప్పారు. నీటిపారుదల శాఖ సిబ్బంది క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.ఎస్సార్‌ఎస్పీ పూర్వవైభవానికి రూ.1,100 కోట్లతో పునరుజ్జీవన పథకం చేపడుతున్నామని, ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. వచ్చే యాసంగి నాటికి పనులు పూర్తి చేయాలని సంకల్పించామని వివరించారు. ప్రాజెక్టు ఆయకట్టుకు ఏటా 2 పంటలకు నీరందించాలని సంకల్పించామని చెప్పారు.మరోవైపు ఇటీవల రైతుల ఆందోళన నేపథ్యంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రాజెక్టు పరిధిలో ఉన్న 9 గ్రామాల్లోనూ పోలీసులు మోహరించారు. మొత్తం 1500 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అటు ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వారినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి కాకతీయ కాలువకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆయకట్టు రైతులు ఇటీవల ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com