ముందుకుసాగేదెప్పుడు..? (గుంటూరు)

గార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆధునికీరణ సుదీర్ఘకాలంగా సాగుతోంది. ప్రపంచ బ్యాంకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందాల నేపథ్యంలో రూ.4,444.44 కోట్లతో కుడి, ఎడమ కాల్వల పనులు 2008లో ప్రారంభించారు. ఆయా కాల్వల కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి 11.19 ఎకరాల్లో సాగు ఉండగా వరి, మిర్చి, పత్తి, ఇంకా ఇతర పంటలు వేసే చివరి భూముల రైతులకు ఖరీఫ్‌, రబీ సీజన్లలో నీటికి తీవ్రమైన ఇబ్బందులు ఉండేవి. ఆధునికీకరణతో చాలావరకు ఇబ్బందులు తప్పాయి. ఇప్పటికే ఆధునికీకరణ ముగించాల్సివుండగా తాజాగా కుడి కాల్వకు ఇటీవలే రూ.277.36 కోట్ల నిధులు రావటంతో పనులు చేపట్టారు. తాజా లెక్కల ప్రకారం రూ.168.69 కోట్లను కాంట్రాక్టర్లు వెచ్చించారు. ఇంకా రూ.108.66 కోట్ల వ్యయం చేయాల్సివుంది. అయితే నిబంధనల ప్రకారం గడువు ముగిసినా ప్రభుత్వం అనుమతించిన నిధుల మేరకు ఇంకా పనులు చేయాల్సివుంది. తాజాగా ఈ అంశంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేక కాంట్రాక్టర్లు పనులు చేసుకుపోతున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఎవరికీ అంతుచిక్కటం లేదు. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చిన నేపథ్యంలో కుడి కాల్వకు తాగునీరు ఇవ్వటానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ 520 అడుగుల మట్టానికి సాగర్‌ జలాశయం వచ్చే వరకు ఆ అవకాశం లేదు. ఈలోపు శ్రీశైలం జలాశయం నుంచే సాగర్‌కు నీరు తీసుకుంటారు. ఇదొక పరిణామం. ఈలోపు ఇప్పటిదాకా చేస్తున్న పనులను కొనసాగిస్తే కేటాయించిన నిధుల మేర సంపూర్ణస్థాయిలో ఆధునికీకరణ ముగుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నీళ్లు ఇచ్చేందుకు వ్యవధి ఉంది కాబట్టి ఆలోపు పనులన్నీ చేయించగలిగితే ఇక సాగర్‌ కాల్వల్లో కొన్నేళ్ల వరకు పనుల మాటే తలెత్తదు. ప్రధానంగా కుడికాల్వ, బ్రాంచి కాల్వల్లో నీటి సరఫరా విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అద్దంకి బ్రాంచి కెనాల్‌కు నీటి విడుదల విషయంలో రెండు జిల్లాల మధ్య వివాదం ఏటా నడుస్తున్నా ఎప్పటికీ సమసిపోవడం లేదు. కాంక్రీటు పనులన్నీ పూర్తయితే సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒక అంచనా. కాబట్టి ప్రభుత్వమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సివుంది. ఇంకా మిగిలి ఉంది రూ.108 కోట్ల పనే అయినందున సంపూర్ణంగా చేయించవచ్చు. అసలు ఇప్పటికే కొన్ని ప్యాకేజీల్లో చాలావరకు పనులు చివరి దశకు వచ్చినా నిబంధనల మేరకు శనివారంతో గడువు ముగిసింది. ఇక మళ్లీ ప్రత్యేకంగా చెప్పేదేమీ ఉండదని కూడా కొంతమంది అధికారుల అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి ముందుగానే వరద వచ్చింది. గత మూడేళ్లుగా సాగర్‌ జలాశయం కింద వరి వేయలేదు. కేవలం వాగులు, చెరువులు, బోర్లు కింద మాత్రమే సాగు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం రైతాంగం సాగర్‌ జలాశయానికి నీళ్లు వస్తాయన్న ఆశతో ఉన్నారు. వారి ఆశలే నిజమైతే భారీ ఎత్తున వరి పండిస్తారనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com