వరాల ఇచ్చే వరలక్ష్మీ

సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. అయితే, శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీమహావిష్ణువు దేవేరి అయిన మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్మీల కంటే వరలక్ష్మీని పూజించడం చాలా శ్రేష్ఠం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా దక్షిణాదిలో వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. పద్ధతులు వేరైనా శ్రీలక్ష్మీని కొలిచే తీరు మాత్రం ఒక్కటే. కైలాసంలో ఏకంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుని పార్వతీదేవి‘స్వామీ! ఏ వ్రతాన్ని ఆచరిస్తే లోకంలోని స్త్రీలు అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులతో ఆనందంగా ఉంటారో చెప్పమని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతికి చెప్పినట్లు స్కాంద పురాణంలో వివరించారు. ఈ సందర్భంగా తన భక్తురాలైన చారుమతి కథను శివుడు వివరించాడు. భర్త, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ సర్వోపచారాలతో చారుమతి వారి సేవించేది. ఉత్తమ ఇల్లాలుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మహాలక్ష్మీని భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆమె పతివ్రత్యా ధర్మానికి వరలక్ష్మీ మెచ్చి అనుగ్రహించింది. ఒక రోజు స్వప్నంలో సాక్షాత్కరించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. స్వప్నంలో మహాలక్ష్మీ చెప్పిన విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి అష్టైశ్వర్యాలను అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడు. పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని అంటారు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, అందరూ లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ‘లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ‘భృగు’వారమనీ వ్యవహరిస్తారు.వరలక్ష్మీ వ్రతం రోజున అంటే పున్నమికి ముందు వచ్చే శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటి ఈశాన్య భాగంలో ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటుచేయాలి. మండపంలో కొత్తబియ్యం పోసి అందంగా తీర్చిదిద్ది, కలశాన్ని ఉంచి, మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి చిగుళ్లను అందులో వేయాలి. కలశంపై నారికేళాన్ని పెట్టి ఎరుపు రంగు రవిక గుడ్డను దానికి అలంకరించాలి. ఆ కలశం ముందు భాగంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. వరలక్ష్మీ కీర్తిస్తూ ధ్యాన ఆవాహన షోడశోపచారాలు, అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అమ్మవారిని అష్టోత్తర శత నామాలలో ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత ఉంది. వేదాల్లో వీటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లక్ష్మీదేవి వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి చెప్పబడింది. నవకాయ పిండి వంటలు, ఫలాలను నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది దారాలతో తయారు చేసిన తోరాన్ని అర్చించి, దాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. భక్తితో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు పూర్తిచేసి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com