దేశ గతిని మార్చేసిన వాజ్ పేయి నిర్ణయాలు

తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగిన మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి భారత రాజకీయాలలో విలువలకు పట్టం కట్టారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో భాగస్వామ్య పార్టీల ఒత్తిడిని తట్టుకుని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానిగా పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు బాటలు వేస్తే ఆ స్ఫూర్తిని వాజ్‌పేయి కొనసాగించారు. వాజ్‌పేయ్ అనంతరం మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి దేశ జీడీపీ 8 శాతం, ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు చేరింది. విదేశీ మారక నిల్వలు సైతం గణనీయంగా పెరిగాయి. వాజ్‌పేయి అనుసరించిన విధానాలు దేశ ఆర్థిక పురోగతికి దిశానిర్దేశం చేసి కొత్త బాటలు వేశాయి. ప్రధానిగా వాజ్‌పేయి చేపట్టిన ప్రాజెక్టుల్లో స్వర్ణ చతుర్భుజి, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన గుర్తుంచకోదగ్గవి. ఇవి ఆయన మానస పుత్రికలు. దేశంలోనినాలుగు ప్రధాన నగరాలు ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నై‌లను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు రహదారులను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులూ దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి.వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో ప్రభుత్వ ప్రాధాన్యతను తగ్గించి, ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. భారత్ అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్, జింక్, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్, వీఎస్ఎన్‌ఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చుట్టారు. ఆరంభంలో ఈ నిర్ణయంపై విమర్శలు ఎదురైనా తర్వాత కాలంలోనూ వచ్చిన ప్రభుత్వాలు దీన్ని అనుసరించాయి. ఆర్థిక బాధ్యత చట్టాన్ని తీసుకొచ్చి ద్రవ్యలోటును తగ్గించారు. ఈ సంస్కరణలు ప్రభుత్వ రంగానికి మరింత ఆదాయాన్ని సమకూర్చాయి. జీడీపీలో ప్రభుత్వ రంగం వాటా 2000 నాటికి 0.8 శాతం ఉండగా, ఈ సంస్కరణల అనంతరం 2005 నాటికి అది 2.3 శాతానికి చేరింది.కొత్త విధానాలు అవలంభించి టెలికమ్ విభాగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. స్థిర లైసెన్స్ విధానం అమలు చేయడంతో టెలికం సంస్థలకు వచ్చే ఆదాయంలో సగం ప్రభుత్వ ఖజానాకు చేరేలా చేశారు. వాజ్‌పేయి హాయంలోనే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)‌ను ఏర్పాటుచేశారు. అలాగే వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టెలికమ్ సెటిల్‌మెంట్ అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. దీంతో అప్పటి వరకూ దేశ టెలికం రంగంలో ఆధిపత్యం సాగించిన అంతర్జాతీయ సంస్థ విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్ హావాకు అడ్డుకట్ట పడింది. మధ్యలో చదువు మానివేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చడానికి సర్వశిక్ష అభియాన్ పథకం ప్రారంభించారు. ఆర్టికల్ 21 ప్రకారం కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా ఆరు నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు ఉచిత ప్రాథమిక విద్యను అందజేయాలనే సంకల్పంతో ఈ పథకానికి నాటి వాజ్‌పేయి ప్రభుత్వం 2001లో శ్రీకారం చుట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com