నిరుద్యోగ భృతి పథకం ‘ముఖ్యమంత్రి – యువనేస్తం’

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకానికి ‘ముఖ్యమంత్రి – యువనేస్తం’ పేరు పెట్టామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గురువారం అమరావతిలో నాలుగు గంటల పాటు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిరుద్యోగ భృతి విధివిధానాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ భేటీ తరువాత మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో ఏపీ లో ఐదు లక్షలా యాభైయేడువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు నిర్ణయించాం. నిరుద్యోగ భృతి కింద నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని, నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అర్హులుంటే ఒక కుటుంబంలో ఎంతమందికైనా చెల్లిస్తామని, ఆగస్టు మూడు లేదా నాలుగో వారంలో నిరుద్యోగ భృతికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ లో ప్రారంభమవుతుందని, పదిహేను రోజుల పాటు ఈ రిజిస్ట్రేషన్లను ఆహ్వానిస్తామని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విదంగా నిరుద్యోగభృతిని ఏపీ లో పకడ్బందీగా అమలుచేస్తాం. 22 నుంచి 35 ఏళ్ళ లోపు నిరుద్యోగులంతా అర్హులని అయన అన్నారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన పదిహేనురోజుల్లో ఈ పథకం అమలు చేయనున్నట్టు చెప్పారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందిస్తామని, అప్రెంటిషిప్ కింద వివిధ సంస్థల్లో నిరుద్యోగులకు పని కల్పించాలని యోచిస్తున్నామని, ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. కాగా, రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల ఖాళీల భర్తీకి, 9 వేల టీచర్ల పోస్టులతో పాటు ఇతర శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని లోకేష్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com