ఉన్నత విద్యతోనే నాయకత్వ పటిమ సిద్ధిస్తుంది – టంగుటూరు ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించిన మేయరు

జాతి అభ్యున్నతికి దిశానిర్దేశం చేయగలిగే నాయకత్వ పటిమ ఉన్నత విద్యతోనే సిద్ధిస్తుందనీ, అత్యంత పేదరికం నుంచి అలాంటి స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం టంగుటూరు ప్రకాశం పంతులుకే స్వంతమని నగర మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 146వ జయంతిని పురస్కరించుకుని స్థానిక మద్రాసు బస్టాండు కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మేయరు గురువారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మేయరు మాట్లాడుతూ అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ప్రకాశం పంతులు తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని కొనియాడారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ, తల్లి కష్టంతో ప్రకాశం పంతులు ఉన్నత విద్యావంతులయ్యారని మేయరు వెల్లడించారు. స్వతంత్ర సమరంలో వీరోచిత పోరాటాల ద్వారా యువతలో ధైర్యాన్ని నింపేవారని తెలిపారు. సైమన్ గో బ్యాక్ అంటూ కమిషను ముందు నించొని దమ్ముంటే కాల్చాలంటూ తుపాకికి రొమ్ము గురిపెట్టిన స్వాతంత్ర సమర యోధునిగా ప్రకాశం పంతులు ప్రసిద్ధులని మేయరు వివరించారు. అలాంటి మహానుభావులు అందించిన స్వతంత్రాన్ని మనం అనుభవిస్తో న్నామనీ, మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మేయరు కోరారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదాత్తమైన ఆలోచనలతో ప్రకాశం పంతులు జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించుకోవడం ఆ మహనీయునికి అందిస్తున్న ఉన్నత గౌరవంగా భావిస్తున్నామని మేయరు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహెబ్, కార్పొరేషను అధికారి క్రిష్ణయ్య, నాయకులు షంషుద్దీన్, ఎపి బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షులు చంద్రమౌళి, నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్షులు వాసుదేవరావు, కార్యదర్శి కామేశ్వర ప్రసాద్, సమితి సభ్యులు సుబ్రహ్మణ్యం, భాస్కర్, హరికృష్ణ, సురేష్ బాబు, ఫణిశర్మ, గోపినాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com