పర్యాటక పండగకు మూడు ప్రణాళికలు

0

నవ్యాంధ్ర కొత్త ఏడాదిలో వినూత్న కార్యక్రమాలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. పొడవైన సాగర తీరం. కేరళను తలపించే రీతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కోనసీమ పర్యాటక పండుగకు సన్నద్ధమవుతోంది. సంస్కృతి, సంప్రదాయాలు, వంటలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, అందమైన నదులు, జలపాతాలు, సుందర సాగరతీరం, పచ్చటి అందాలు, ఆకర్షణీయమైన కొబ్బరి తోటలు ఇలా అన్నింటినీ మేళవించి జిల్లాను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దటానికి సంకల్పించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా మూడు పర్యాటక ఉత్సవాలు జరుపుకునేందుకు తూర్పువాకిట తలుపులు తెరుచుకున్నాయి. కాకినాడలో సంక్రాంతిని పురస్కరించుకుని కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌లో ఈనెల 12 నుంచి 15 వరకూ సాగర సంబరాలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఫిబ్రవరి 23 నుంచి 26 వరకూ కోనసీమ ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. ఉగాదిని పురస్కరించుకుని మన్యం జాతరను మార్చి 26 నుంచి 28 వరకూ నిర్వహించాలని నిర్ణయించారు. సంక్రాంతికి కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌లో సాగర సంబరాలు నిర్వహణకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకూ నాలుగు రోజులపాటు కోనసీమ ప్రాంతంలో ఇక్కడి ఆచార వ్యవహారాలు, భాష, యాస, సంస్కృతిపై ఉత్సవాలు చేయనున్నారు. పర్యాటక రంగానికి ఆయువుపట్టు లాంటి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మన్యం జాతర నిర్వహించటానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఉగాదిని పురస్కరించుకుని మారేడిమిల్లి వనవిహారి వద్ద మార్చి 26 నుంచి 28 వరకూ మూడు రోజులపాటు జాతర నిర్వహించాలని నిర్ణయించారు. పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఉన్న విశాలమైన అడవులు, జలపాతాలు, వాగులు సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజనుల సాంప్రదాయాలు, వంటకాలు, ఉపయోగించిన పురాతన పరికరాలతో ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు.

Share.

Comments are closed.