శ్రీవారికి సిరులు కురిపిస్తున్న కురులు

0

kalyaanakatta_apduniaతిరుమలలో వేలాది మంది భక్తులు ప్రతిరోజూ శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. తలనీలాల ద్వారా టీటీడీ భారీ మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఈ సంవత్సరం జరిగిన బ్రహ్మోత్సవాల్లో 3.4 లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. వీరిలో 1.7 లక్షల మంది మహిళలు ఉండడం విశేషం. గతంతో పోలిస్తే ఇది 45 శాతం అధికమని టీటీడీ అధికారి అన్నారు. తలనీలాల అమ్మకంలో టీటీడీ కొత్త పద్దతులు అనుసరిస్తోంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ టీసీఎస్ తో టీటీడీ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తిరుమలలో పలు సౌకర్యాలు భక్తులకు ఆన్ లైన్ ద్వారా లభించనున్నాయి. తలనీలాలు సమర్పించే విషయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆన్ లైన్ ద్వారా టోకెన్లు పొందే విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ ఒప్పందంలో భక్తులు తలనీలాలు సమర్పించే కల్యాణ కట్ట వద్ద టీవీలను ప్రవేశపెట్టనున్నారు. వాటిలో టీటీడీ కార్యక్రమాలు, పురాణగాధల చిత్రాలు ప్రదర్శిస్తారు. గతంలో టీటీడీ తలనీలాల వేలం పాటలో కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించేది. అంతర్జాతీయంగా తలనీలాలకు ఉన్న డిమాండ్ ని గుర్తించిన టీటీడీ అధికారులు 2011లో తొలిసారి ఆన్ లైన్ వేలం పాట ప్రవేశపెట్టారు. దాదాపు 1,500 టన్నుల తలనీలాలు రూ.600 కోట్లకు పైగా అమ్ముడవడం విశేషం. తలనీలాల ద్వారా టీటీడీకి ప్రతియేటా 200 కోట్లు ఆదాయం వస్తుండడం విశేషం. 2016-17 సంవత్సరానికి గాను ఈ ఆదాయం 220 కోట్లకు చేరే అవకాశం ఉందని టిటిడి అధికారులు అంచనా వేస్తున్నారు.

Share.

Comments are closed.