ముగ్గురు..ముగ్గురు సెంటిమెంట్

పని లేకుండా ఖాళీగా ఉండలేను. నా దృష్టిలో రెస్ట్ అనేది అరెస్ట్ అయినప్పుడు మాత్రమే. నేను పని చేస్తూ ఉండడాన్నే ఎంజాయ్ చేస్తాను. అందులోనే నాకు సంతోషమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సోమవారం నాడు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల మీడియాతో వెంకయ్య నాయుడు తన నివాసంలో మాట్లాడారు. గతంలో ఏదైనా కార్యక్రమం ఉందంటే 10 ని.లు ముందే ఉండేవాడిని. ఉప రాష్ట్రపతిని అయ్యాక ప్రొటోకాల్ అడ్డొస్తోంది. ముందే వెళ్లడం కుదరడం లేదు. మీటింగ్ – గ్రీటింగ్ పీపుల్, ఈటింగ్ విత్ దెమ్ అన్నది నా పాలసీ. ఇప్పుడు ఉపరాష్ట్రపతిని అయ్యాక ప్రొటోకాల్ కారణంగా ప్రజల్ని కలవడం ఇబ్బందిగా ఉన్నా నేను మాత్రం ఏదో ఒక రకంగా కొనసాగిస్తున్నాను. విద్యార్థులను కలవడం, పరిశోధనా సంస్థలకు వెళ్లడం, రైతు సమస్యలపై పరిష్కారాలు వెతకడం, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించడం నా ప్రాధాన్యాంశాలుగా పెట్టుకున్నాను. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలన్నది నా అభిమతం. రాజ్యసభ ఛైర్మన్గా నా దగ్గరికొచ్చిన అనర్హత పిటిషన్పై వెంటనే చర్య తీసుకున్నానని అయనఅన్నారు. పార్టీ ఫిరాయింపులు రాజకీయంగా నైతికం కాదని నేను మంత్రిగా ఉన్నప్పుడే చెబుతుండేవాడిని. ఇదే మాటను చంద్రబాబు, కేసీఆర్ సమక్షంలో కూడా చెప్పాను. లోక్సభ, అసెంబ్లీ స్పీకర్లు నా నిర్ణయాన్ని ఉదాహరణగా తీసుకుని స్పందిస్తారని భావించాను. కానీ అలా జరగలేదని అయన అన్నారు. సభలో హుందాగా వ్యవహరించడం సభ్యుల బాధ్యత. సభ్యులు కనీస సభా మర్యాద మరచి ప్రవర్తిస్తున్నారు. ఒకరిద్దరు సభ్యులు సభాధ్యక్షుడిగా ఉన్న నన్నే పక్షపాతి అంటూ నిందించే ప్రయత్నం చేశారు. ఈ నిందతో నేను వెనక్కి తగ్గుతానని రాజకీయ ఎత్తుగడ వేశారని అన్నారు. కానీ వారు చదువుకున్న పాఠశాలకు నేను ప్రిన్సిపాల్ని అని గ్రహించలేకపోయారు. అన్నాడీఎంకే శశికళ పుష్ప, వైకాపా విజయసాయిరెడ్డి ఉదంతాలు ఉదహరిస్తూ సభలో ఆరోపణలు చేసి, తర్వాత వ్యక్తిగతంగా కలిసి క్షమాపణ కోరారని అయన వెల్లడించారు. బాధ్యాతాయుతమైన ప్రతిపక్షం, ప్రతిస్పందించే అధికారపక్షం ఉండాలని నేను సభలోనే చెప్పాను. ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అన్-పార్లమెంటరీ పదాలు లేనప్పటికీ, ప్రధాని స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్య అపార్థాలకు దారితీయవద్దనే ఉద్దేశంతో రికార్డుల నుంచి ఆ మాటను తొలగించానని వెంకయ్య అన్నారు. ఒకవేళ రికార్డుల నుంచి తొలగించకపోతే, సభ్యులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులను స్వీకరించాల్సి వచ్చేది. తద్వారా సభలో మరింత సమయం దానిపై చర్చించాల్సి వచ్చేది.
ఆసక్తికర వ్యాఖ్య
ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన 12 మంది ఫొటోలను చూపిస్తూ.. తొలి ముగ్గురు ఉపరాష్ట్రపతులు తర్వాత రాష్ట్రపతులయ్యారు, ఆ తర్వాత ముగ్గురూ కాలేదు, మళ్లీ తర్వాత ముగ్గురు అయ్యారు, ఆ తర్వాత ముగ్గురు కాలేదు.. అన్నారు. “ఈ ఆనవాయితీ కొనసాగితే తదుపరి రాష్ట్రపతి మీరే అవుతారేమో అంటే” నవ్వుతూ భేటీని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com