సొంత పార్టీ సిట్టింగుల్లో గుబులు

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏది మాట్లాడినా.. అందులో ఏదో మెలిక ఉంటుంది.. అది సొంత పార్టీ నేత‌ల‌తోపాటు ప్ర‌త్య‌ర్థుల‌నూ మెలిపెడుతుంది. ఆయ‌న మాట్ల‌లో మంత్ర‌మే కాదు.. యుద్ధ‌తంత్ర‌మూ ఉంటుంది. అందుకే ఆయ‌న మౌనంగా ఉన్నా.. మాట్లాడినా రాజ‌కీయ వ‌ర్గాల్లో వ‌ణుకుపుడుతుంది. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సొంత పార్టీ సిట్టింగుల్లో గుబులు రేపుతున్నాయి. సిట్టింగులంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని చెబుతూనే.. ఒక 20 మంది సీట్లు మాత్రం క‌ష్ట‌మేన‌ని ఆయ‌న చెప్పేశారు. రెండు రోజుల క్రితం జ‌రిగిన పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో ప‌లువురు ఎమ్మెల్యేలు వ‌ణికిపోతున్నారు.ఈ ఇర‌వైమందిలో ప‌లువురు మంత్రులు కూడా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా.. సెప్టెంబ‌ర్‌లోనే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న చెప్పేశారు. ఇర‌వై రోజులు.. ఇర‌వై మంది ఎమ్మెల్యేలు.. ఈ టైమేమిటి అని అనుకోకండి.. సెప్టెంబ‌ర్ 2న టీఆర్ఎస్ పార్టీ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ నిర్వ‌హించ‌నుంది. కొంచెం అటు ఇటుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ఖాయ‌మ‌నే టాక్ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అవ‌స‌ర‌మైతే.. ఆ స‌భ‌లోనే పెద్ద సంఖ్య‌లో అభ్య‌ర్థుల‌ను సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. కేసీఆర్ తాజాగా ప్ర‌ధాన‌మంత్రి మోడీని క‌లిసి వ‌చ్చాక ముంద‌స్తుపై దూకుడుగా ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌కు పార్టీ సీనియ‌ర్ నేత కేశ‌వ‌రావు నేతృత్వంలో స్క్రీనింగ్ క‌మిటీని కూడా వేశారు. కార్యదర్శులు పర్యవేక్షిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, ఎమ్మెల్యే పనితీరును పార్టీ అధినాయకత్వానికి అందచేయాలని కోరారు. దీంతో ఈ ఇర‌వై రోజుల్లోనే త‌మ భ‌విత‌వ్యం తేలిపోతుంద‌ని ప‌లువురు సిట్టింగులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఎవ‌రా డేంజ‌ర్ జోన్ ఎమ్మెల్యేలు అనేది పార్టీవ‌ర్గాల్లో తీవ్ర ఉత్కంఠ‌ను రేపుతోంది. అయితే, ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్యేల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలోనూ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక‌రిద్ద‌రికి త‌ప్ప సిట్టింగులంద‌రీ వ‌చ్చ ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.దీంతో అటు ఇటుగా ఉన్నప‌లువురు ఎమ్మెల్యేలు త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చురుగ్గా తిరిగారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. కానీ.. ఇప్పుడు ఆ జాబితా ఒక‌రిద్ద‌రి నుంచి 20 మందికి చేరడం గ‌మ‌నార్హం. అంటే ఈ లెక్క‌న ఆ డేంజ‌ర్ జోన్‌లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న నాటికి మ‌రింత పెరిగే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్లు ఎవ‌రికి వ‌స్తాయో.. ఎవ‌రికి రావో.. తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. పార్టీలో జంపింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందిని త‌ప్పించేస్తార‌న్న వార్త‌ల‌తో వారి గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన పార్టీ అభ్య‌ర్థులు సైతం టిక్కెట్లు రాక‌పోతే తీవ్ర‌మైన అసంతృప్తి గ‌ళం వినిపించే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈ విష‌యంలో మ‌రింత క్లారిటీ రావాలంటే ప్ర‌గ‌తినివేద‌న స‌భ దాకా ఆగాల్సిందే మ‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com