సిట్ పై నమ్మకం లేదు : అయేషా పేరంట్స్

11ఏళ్ల క్రితం హత్యకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కలిశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌పై తమకు నమ్మకం లేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. సిట్‌లో ఉన్న కొంతమంది అధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని.. అసలు దోషుల్ని మాత్రం విచారించడం లేదని ఆరోపిస్తున్నారు. హత్య జరిగిన 10ఏళ్లు దాటిపోయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయేషా తల్లిదండ్రుల విజ్ఞ‌ప్తిపై స్పందించిన డీజీపీ.. తగిన న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. 2007 డిసెంబర్‌లో బీ ఫార్మసీ చదవుతున్న ఆయేషా మీరాను విజయవాడలో ఆమె ఉంటున్న హాస్టల్‌లోనే దారుణంగా హత్య చేశారు. డెడ్‌బాడీని తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో పడేశారు. అక్కడ ఓ లేఖ కూడా బయటపడగా.. అందులో తన ప్రేమను నిరాకరించినందుకు ఆమెను చంపినట్లు రాసి ఉంది. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సత్యంబాబు అనే యువకుడ్ని అరెస్ట్ చేయగా.. తర్వాత అతడు నిర్థోషని తేలడంతో విడుదలయ్యాడు. సత్యంబాబు విడుదల కావడంతో ఈ కేసు వ్యహారం మళ్లీ మొదటికి వచ్చింది. అసలు దోషులెవరో కూడా తేలలేదు. దీంతో ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించింది. అయితే ఈ సిట్ దర్యాప్తుపై ఆయేషా తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. డీజీపీని కలిశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com