తిరుమలలో వైభవంగా రెండో రోజు బాలాలయ మహోత్సవం. వివిద ప్రాంతాల నుండి తిరుమలకు చేరిన వేద పండితులు. స్వామికి జరిగే ఈ బాలాలయం మహోత్సవంలో భక్తులు సహకరించారు… జేఈఓ శ్రీనివాసరాజు

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయంలోని మూలమూర్తికి పటిష్టత కోసం విగ్రహం చుట్టూ కదలికలు లేకుండా ధృడంగా ఉండేందుకు ఎనిమిది వైపులా సంధి బంధనం చేయడాన్నే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. అలాగే స్వామికి అషేష శక్తియుక్తులు కలిగేలా వేద పండితులు వేదాల ద్వారా పఠనం చేసి విశిష్టకైంకర్యాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారు చేస్తారు. ఈ వేడుక తిరుమల ఆలయంలో రెండోరోజు వైభవంగా జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాల ఋత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. అదేవిధంగా, ఉదయం 6 నుండి 12 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలాలయ మహోత్సవంలో భాగంగా మూడురోజు మంగళవారం ఉదయం శ్రీవారి మూలమూర్తితో పాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్ట బంధనాన్ని సమర్పిస్తారు. అష్టబంధనం గురించి భృగు మహర్షి రచించిన భృగుప్రకీర్ణాధికారం గ్రంథంలో ఇలా వివరించారు. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. వీటిలో 1.శంఖచూర్ణం – 25.5 తులాలు, 2.మధుజ (తేనెమైనం)- 3.5 తులాలు, 3.లాక్షా(లక్క) – 3.75 తులాలు, 4.గుగ్గులు(వృక్షపు బంక)- 9 తులాలు, 5.కార్పాసం(ఎర్ర పత్తి)- 1 తులం, 6.త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ)- 7.5 తులాలు, 7.రక్తశిలాచూర్ణము (గైరికము)- 7.5 తులాలు, 8.మాహిష నవనీతము (గేదె వెన్న) – 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని , గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు. ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలు బాగా దంచుతారు. బాగా దంచిన తరువాత అది పాకంగా తయారవుతుంది. ఈ పాకం చల్లబడిన తరువాత ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను గంటకు ఒక్కసారి చొప్పున 8 మార్లు కావలసిన వెన్నను చేర్చుతూ దంచాలి. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టు పక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు.
శ్రీవారి ఆలయంలో ఇవాల ఉదయం క్యూలైన్లో ఉన్న భక్తులతో జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు మమేకం అయ్యారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు దర్శనానికి పడుతున్న సమయం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ బాలాలయ మహోత్సవ వేడుకలు పూర్తైయ్యే వరకు భక్తులు టీటీడీకి సహకరించాలని కోరారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వేడుకలు చాలా అద్బుతంగా, వైభవోపేతంగా జరుగుతున్నట్టు జేఈఓ మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com