భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లతో పాటు విశాఖ, విజయవాడ సహా పలు పట్టణాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో నదిలోకి వరద పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.7 అడుగులకు చేరింది. 14.37 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆదివారం నుంచి ఏకధాటిగా కురుస్తోన్న వర్షాల ధాటికి తెలంగాణలో మృతుల సంఖ్య ఆరుచు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. దీంతో ఆ జిల్లాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అశ్వారావు పేటలో 21 సెం.మీ. వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద రహదారి తెగిపోయింది. దీంతో భద్రాచలం, ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన వాహనాలను చింతలపూడి మీదుగా మళ్లిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. వర్షాలు నిరంతరాయంగా కురుస్తుండటంతో.. కాళేశ్వరం ఎత్తిపోత పనులు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 46 అడుగులకు చేరింది. చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి 1.77 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో.. పంట పొలాలు నీట మునుగుతున్నాయి.గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడంతో కొవ్వూరు వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాలతో 7,174 హెక్టార్లలో పంట నీటమునిగింది. ఇళ్లు, కాలనీల్లోకి నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని 11,950 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.గోదావరి, శబరి నదీ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా విలీన మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తాగునీరు, నిత్యావసరాలు, విద్యుత్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అయిదు రోజులుగా కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. దీంతో వైద్యం అందక పలు గ్రామాల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోనసీమలో అధికారులు 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.పశ్చిమగోదావరిలోని తమ్మిలేరు జలాశయానికి వరద ఉధృతి పెరగడంతో లింగరావు గూడెం వద్ద గండి పడిందని అధికారులు తెలిపారు. డ్యామ్‌లోని నీరు మదేపల్లి, జలిపుడి గ్రామాల్లోకి చేరింది. దెందులూరు మండలం కొవ్వలిలో వెయ్యి ఎకరాల పంట నీట మునిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్రలో ఓ మోస్తరు, తెలంగాణలో విస్తారంగా బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్ధని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com