హైకోర్టుకు చేరిన దుర్గగుడి చీర కేసు

విజయవాడ దుర్గగుడి చీర మాయం కేసు మరో కీలక మలుపు తిరిగింది. తనను పాలకమండలి సభ్యురాలిగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ కోడెల సూర్యలత హైకోర్టు మెట్లెక్కారు. తనను బోర్డ్ సభ్యురాలిగా అన్యాయంగా తొలగించారంటూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. దుర్గగుడి ఈవో, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రస్ట్ బోర్డ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై నాలుగువారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. దుర్గమ్మకు భక్తుల సమర్పించిన చీరల్లో ఓ చీర కనిపించకపోవడంతో ఈ వివాదం మొదలయ్యింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం, పాలకమండలి విచారణ జరిపించింది. ఈ చీరను పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత తీశారనే తేలిందంటూ.. ఆమెను బోర్డ్ సభ్యురాలి పదవి నుంచి తప్పించారు. అలాగే ఈవోను కూడా బదిలీ చేశారు. అంతటితో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడిందని అందరూ భావించారు. కాని ఈ చీర మాయం కేసు మళ్లీ మలుపు తిరిగింది. చీర మాయం కావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సూర్యలత మీడియా ముందుకు వచ్చారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూనే.. దేవస్థానంలో అవినీతి, లైంగిక వేధింపులంటూ బాంబ్ పేల్చారు. పాలకమండలి ఛైర్మన్ గౌరంగబాబుతో పాటూ మరో సభ్యుడు శంకర్‌‌బాబుపై ఆరోపణలు చేశారు. వారి అవినీతి, అక్రమాలను అడ్డుకున్నందుకే తనపై చీర దొంగతనం మోపారని ఆరోపించారు. ఈ అవినీతి గురించి ఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆమె చేసిన ఆరోపణలో పెద్ద దుమారాన్ని కూడా రేపగా.. ఇవాళ ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com