మూడు కోట్ల విలువైన చేప పిల్లల పంపిణీ

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.. ఆర్థికంగా బలోపేతం చేస్తోంది.. ఉపాధికి ఢోకాలేదని భరోసా ఇస్తోంది.. వందశాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేస్తోంది.. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది.. కానీ క్షేత్రస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి. వీటి పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి.. లెక్కల్లో గోల్‌మాల్‌ చేస్తున్నారు. ఈసారైనా లెక్క తప్పకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 837 చెరువుల్లో 4.20 కోట్ల చేప విత్తనాలను పోశామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 2.62 కోట్లు ఖర్చు చేశారు..వారు చెప్పిన లెక్కల్లో తేడాలు ఉన్నాయి. కాసారాలు లేకున్నా.. ఉన్నట్లు పేర్కొంటూ.. వాటిల్లో చేపలను వదిలినట్లు రికార్డులు సృష్టించారు. బిల్లులు కాజేశారు. మహబూబాబాద్‌ మండలం బేతోల్‌ గ్రామ పంచాయతీలో ఏడు కుంటలు మాత్రమే ఉంటే పది ఉన్నట్లు సృష్టించి.. పిల్లల్ని పోసినట్లు రికార్డులు రాశారు. ఇదే తరహాలో రెడ్యాల, మల్యాల, వేంనూరు, వీఎస్‌ లక్ష్మిపురం గ్రామాల్లో కూడా లేని చెరువుల్లో పోసినట్లు లెక్కలు చూపించారు. అంతేకాదు తక్కువ వదిలి ఎక్కువ పోసినట్లు లెక్కలు చూపించారని మత్స్యకారులే తెలిపారు.ఇలా సుమారు రూ.అరకోటికి పైగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నీటిలో పోసిన వాటిని లెక్కించడం కష్టం. కాబట్టి అధికారులు ఏది చెబితే అదే చెల్లింది.ఈసారి చెరువులు, కుంటల సంఖ్య పెరిగింది. 1076 కాసారాల్లో 4.43 కోట్ల చేపనారు వదలాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు రూ. 3 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 40 పెద్ద చెరువుల్లో 80 మి.మీటర్ల నుంచి 100 మి.మీటర్ల పరిమాణంలో ఉండే 4.88 లక్షలు, 1036 కుంటల్లో 35 మి.మీటర్ల నుంచి 40 మి.మీటర్ల పరిమాణంలో ఉండే 3.94 కోట్ల చేప పిల్లల్ని వదలాలన్ని నిర్దేశించుకున్నారు.నిరుడు చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయి. లేని చెరువులు, కుంటల్లో కూడా పోసినట్లు రికార్డులు సృష్టించారు. అలాగే తక్కువ పిల్లల్ని వదిలి ఎక్కువ పోసినట్లు లెక్కలు చూపించి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది జిల్లాలో పంపిణీ ప్రారంభమైంది పెద్ద చెరువులో 2.88 లక్షల పిల్లల్ని పోశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లెక్క ప్రకారం వదలాలని మత్స్యకారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com