చైనాతో త్వరలో 21వ దఫా సరిహద్దు చర్చలు పశ్చిమ సెక్టార్‌ అంశమే ప్రధానమన్న రాంమాధవ్‌

భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదాలు ఒక కొలిక్కి వస్తున్నాయని, పశ్చిమసెక్టార్ మినహాయించి మిగతా భూభాగానికి చెందిన వివాదం అంతా దాదాపు పరిష్కారం అయ్యిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వెల్లడించారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో విభేదాల పరిష్కారానికి ప్రధాని మోదీ కృషి చేస్తూ మైత్రీ బంధాన్ని కొనసాగిస్తున్నారని రాం మాధవ్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొన్నాయని అన్నారు. త్వరలో ఉభయ దేశాల మధ్య 21వ సరిహద్దు చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఎన్డీయే పాలిత ఈశాన్య రాష్ట్రాల మంత్రులతో కలిసి ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న రాం మాధవ్, చైనాతో సానుకూల దిశగా చర్చలు జరుగుతున్నాయని అక్కడ మీడియాతో చెప్పారు. డోక్లాం వివాదంపై మాట్లాడేందుకు ఏమీ లేదన్నారు. భారత్ , చైనా, బూటాన్ దృక్పథాల్లో మార్పేమీ ఉండదని మునుపటి లాగే ఉంటుందని చెప్పారు. చైనా సేనలు డోక్లాం ట్రైజంక్షన్ లో చేపడుతున్న నిర్మాణాలపై ఏమీ మాట్లాడలేమని, వారి స్థలంలో వారు నిర్మాణాలు చేపడితే అది వారి హక్కు అని రాం మాధవ్ అన్నారు.
ప్రస్తుతం సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం, చైనాతో వాణిజ్య లోటు వంటి సమస్యలను పరిష్కరించుకోవటం కోసం 21వ దఫా చర్చలు జరుగుతాయని చెప్పిన రాం మాధవ్ రెండు దేశాలు ఒప్పందానికి వచ్చిన తర్వాత విపక్షాలతో రాజకీయ ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.

‘భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యూ మధ్య త్వరలో చర్చలు ప్రారంభమవుతాయన్న ఆయన పశ్చిమ సెక్టార్‌లోఅపరిష్కృతంగా ఉన్న కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘క్రియాశీల రాయబారం’ ద్వారానే చైనా తో సరిహద్దు, వాణిజ్య వివాదాలు పరిష్కరించుకోవాలని భారత్‌ స్పష్టమైన వైఖరితో ఉందని, ఇందుకు రెండు ప్రభుత్వాలూ కృషి చేస్తున్నాయని ఆయన చెప్పారు.
ఈరోజు మనకు చైనాతో 51 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల మేర వాణిజ్య లోటుందని, దాన్ని 20-30 బిలియన్లకు తగ్గించినా గొప్పే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. శిఖరాగ్ర స్థాయిలో భారత్‌-చైనాల నడుమ సత్సంబంధాలు నెలకొనడంతో పొరుగు దేశాలు సంబరపడుతున్నాయని, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక ఇలా పొరుగు దేశాలతో సత్సంబంధాల వల్ల వాణిజ్యపరమైన సంబంధాలు మెరుగుపడతాయని రాం మాధవ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com