దేశం కాని దేశంలో.. కష్టాల కొలిమిలో.

గల్ఫ్ కల.. పలువురికి పీడకలగా మిగిలిపోతోంది. మంచి ఉపాధి లభిస్తుందని ఎన్నో ఆశలతో గల్ఫ్ లో అడుగిడిన తెలుగువారు సమస్యల్లో కూరుకుపోతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు దుర్భర పరిస్థితుల్లో గడుపుతున్నారు. ఏజెంట్లు చేసిన మోసానికి దేశంకాని దేశంలో నానాపాట్లు పడుతున్నారు. కతార్ రాజధాని దోహాలో మంచి ఉపాధి, మెరుగైన వేతనం లభిస్తుందంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు కొందరు నకిలీ ఏజెంట్లు ఆశజూపారు. దీంతో అప్పులు చేసి గల్ఫ్ వెళ్లిన జిల్లావాసులు అక్కడ పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏజెంట్ వీసాలో పేర్కొన్న కంపెనీ అక్కడ దుకాణం ఎత్తేసింది. దీంతో సదరు కంపెనీలో ఉద్యోగాల కోసం వెళ్లిన స్థానికులు రోడ్డున పడ్డారు. పరాయిదేశం, భాష తెలీదు. తెలిసినవారూ ఎవరూ లేరు. ఎక్కడ ఉండాలో.. ఎలా సంపాదించుకోవాలో అస్సలు తెలీదు. మొత్తంగా దోహా వెళ్లిన పలువురు తెలుగువారు దుర్భర జీవితం గడుపుతున్నారు. నిలువనీడలేక రోడ్లవెంబడి ఫుట్ పాత్ లపై ఉంటున్నారు. 50డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిపోతూ స్వస్థలాలకు వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్లలకు చెందిన వారు దాదాపు రెండు నెలలుగా కతార్ లో రోడ్లపైనే గడుపుతున్నారు. వీరు పడుతున్న కష్టాలకు స్వస్థలాల్లోని కుటుంబీకులు అల్లాడిపోతున్నారు. తమవారిని సురక్షితంగా స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వేడుకుంటున్నారు.

పల్లె తరిమింది. గల్ఫ్‌ రమ్మంది. ఉన్న ఊర్లో బతుకుదెరువు కరువై జానెడు పొట్టను నింపుకోవడానికి గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు లక్షల మందే ఉన్నారు. అయితే అక్కడికి వెళ్లినతర్వాత పలువురు కష్టాల్లో పడుతున్నారు. ఈ వెతలను వర్ణించాలంటే మాటలు వెతుక్కోవాల్సిందే. పరాయి దేశాల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నవారిని ఆదుకునే చర్యలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నా బాధితులందరినీ కాపాడ్డం భారంగానే పరిణమిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యూఏఈ ప్రకటించిన ఆమ్నెస్టీ బాధితులకు కొండంత ఊరటనిచ్చింది. మెరుగైన ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన తెలుగువారిలో అనేకమంది కష్టాల్లో పడ్డారు. ఈ సమస్యల నుంచి బయటపడేలోపే వీసా గడువు ముగిసిపోవడంతో అక్రమ వలసదారులుగా మారారు. మరికొందరు ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా నివసిస్తున్నారు. మొత్తంగా అనివార్యమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని ఇంటికి రాలేక మగ్గుతున్న అక్రమ వలసదారులకు యూఏఈ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31లోగా జైలు శిక్షలు లేకుండా వారి స్వదేశాలకు వెళ్లిపోవచ్చని వెల్లడించింది. దీంతో ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమైన వలస జీవులు ఆమ్నెస్టీపై ఆశలు పెట్టుకున్నారు. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com