పేదింటికి పన్నుపోటు (ఖమ్మం)

పేదలకు నిర్మించి ఇచ్చేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఉభయ జిల్లాల్లో జీఎస్టీ సెగ తగులుతోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన జీఎస్టీ విధానం వీటిపై కూడా పడడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో మొదటి 1,298 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.66 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 1,096 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన 202 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రెండో విడతగా 2,920 ఇళ్ల నిర్మాణానికి రూ.147 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 129 ఇళ్లు పూర్తయ్యాయి. మొదటి విడతగా మంజూరైన ఇళ్లల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.04 లక్షలు, మౌలిక వసతులకు మరో రూ.1.25 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఇళ్లను అన్ని హంగులతో చక్కగా నిర్మించారు. రెండో విడత మంజూరు చేసిన ఇంటికి రూ.5.04లక్షలు మాత్రమే మంజూరు చేశారు. మౌలిక వసతుల విషయాన్ని విస్మరించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పోటుతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. గతేడాది జులై ఒకటి నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా అప్పటి నుంచి ఇళ్ల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ విధించారు. గతంలో ఇల్లు మంజూరైతే వ్యాట్‌ ట్యాక్స్‌ కలిపి బిల్లు చేసి మినహాయించుకొనేవారు. దీంతో కాంట్రాక్టర్లపై భారం పడేది కాదు. దీనివల్ల లబ్ధిదారుడికి ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం జీఎస్టీతో లబ్ధ్దిదారుడికి మంజూరైన యూనిట్‌ డబ్బుల్లో నుండే జీఎస్టీ సుమారు రూ.60వేల వరకు మినహాయించుకొంటున్నారు. ఒక ఇంటికి రూ.5.04 లక్షలు మంజూరైతే దాంట్లో రూ.65 వేలు జీఎస్టీ కింద మినహాయించుకొంటున్నారు. దీంతో యూనిట్‌ విలువ రూ.4.44 లక్షలతో ఇల్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంటికి అన్ని హంగులు కావాలంటే డబ్బులు సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
జీఎస్టీ విధించే నాటికి జిల్లాలో 800 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలిన 498 ఇళ్లకు జీఎస్టీ కింద రూ.3 కోట్లు నిలిపేసినట్లు సమాచారం. రెండో విడత మంజూరైన ఇళ్లకు జీఎస్టీ కింద సుమారు రూ.17 కోట్ల భారం పడనుంది. ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్‌ విలువలో జీఎస్టీ సొమ్మును అదనంగా మంజూరు చేసి ఆ మేరకు నిలిపివేస్తే తమపై భారం పడదని కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే రూ.4.44 లక్షలతో ఎంత వరకు నిధులు సరిపోతాయో చూసుకొని మిగిలినవి నిలిపి వేస్తామని అంటున్నారు. దీంతో ఇంటి నిర్మాణం అసంపూర్తిగా ఉండి లబ్ధిదారులు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com