సంక్షేమ కార్యక్రమాలపై నిఘా

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో కార్యాలయ అధికారులు, సిబ్బందే దళారులుగా మారి లబ్ధిదారులకు సకాలంలో పథకాలు చేరకుండా అడ్డుపడటంతో అధిక సంఖ్యలో లబ్ధిదారులు కలెక్టర్‌కు ప్రతీ వారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేస్తునే వున్నారు. అంతేకాకుండా బీసీ, ఎస్సీ సంఘాలకు ఏటా మంజురు చేసే రుణాల విషయంలో కూడా అధిక సంఖ్యలో లబ్ధిదారుల నుంచి అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు రావడంతో ఇటీవల కాలంలో పలువురు అధికారులను కూడా స్థాన చలనం నిర్వహించిన సందర్భాలు లేకపోలేదు. నగరంలోని ఎంవీపీకాలనీలో ఉన్న సంక్షేమ భవన్‌లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, సాంఘిక సంక్షేమ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పనుల విషయంలో ప్రతీ రోజూ ఈ సంక్షేమ భవన్‌కు వందలాది మంది లబ్ధిదారులు వారి వారి పనులపై వస్తుంటారు. ఈ సమయంలోని కొంత మంది వ్యక్తులు కార్యాలయ ఆవరణలోనే దళారులుగా మారీ మీకు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తామని, పథకాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మేమే చూసుకుంటామంటూ వారికి నమ్మబలికి వారి నుంచి అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అధికం కావడంతో ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌లో నాణ్యాత, వార్డెన్లు హాజరు, విద్యార్థులకు పెట్టాల్సిన ఆహార మోను విషయంలో సక్రమంగా నిర్వహాణ జరగడం లేదనే అధికారుల దృష్టికి కొంత మంది తీసుకువెళ్లడంతో ఇటీవల కొద్ది రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు జిల్లాలో ఉన్న పలు సోషల్ వెల్పేర్ హాస్టల్స్‌ను తనఖీ చేసి వీటిలోని జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించారు. అంతేకాకుండా మహిళా సంక్షేమ శాఖ కార్యాలయానికి సంబంధించి కూడా ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకూ అందరిపై అవీనితి, ఆరోపణలు రావడంతో జిల్లా ఉన్నతాధికారులే నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి విజయనగరం నుంచి బదిలీపై వచ్చిన ఒక ఉద్యోగి అక్కడ అవినీతికి పాల్పడినందున ఇప్పటికే విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తూ, ఇక్కడ పాలన వ్యవహారాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఆరు విభాగాలకు కేంద్రమైన సంక్షేమ భవన్‌లో అవినీతి ఉదాంతాలపై నిగ్గుతేలిచ్చేందుకు గడిచిన వారం రోజులుగా కార్యాలయం పరిసర ప్రాంతాల్లోనే తిరగడం విశేషం. ఇప్పటికే గడిచిన రెండేళ్లలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ శాఖలకు సంబంధించి అవినీతికి పాల్పడిన అధికారులను ఏసీబీ అధికారులు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన పలువురు ఉద్యోగలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏ ఏ అధికారి ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారనే సమాచారం కూడా పూర్తి స్థాయిలో ఉండటంతో ఏ నిమిషంలో ఎవ్వరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com