బక్రీదు ప్రార్ధనలకు అన్ని ఈద్గాలలో ప్రత్యేక సౌకర్యాలు – కార్పోరేషను ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ఆదేశాలు – ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర మేయరు అబ్దుల్ అజీజ్

త్యాగానికి ప్రతీకగా నిలిచిన ముస్లింల ప్రధాన పండుగ బక్రీదు పవిత్ర ప్రార్ధనలకై నగరంలోని అన్ని ఈద్గా ప్రాంగణాల్లో కార్పోరేషను ఆధ్వర్యంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. స్థానిక నజీరుతోట, ఈద్గామిట్ట, జనార్ధన్ రెడ్డి కాలనీల్లోని ఈద్గాలలో జరుగుతున్న ఏర్పాట్లను మేయరు మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేషను ఆధ్వర్యంలో అన్ని మతాల పండుగలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ప్రధానమైన బారా షహీద్ దర్గా లోని ఈద్గా ప్రాంగణంలో సుమారు పాతిక వేలమంది ప్రజలు ప్రార్ధనలు చేసుకునేలా 80వేల చదరపు అడుగుల స్థలంలో వసతులు కల్పించి, వర్షాన్ని నిలువరించే వాటర్ ప్రూఫ్ షామియానాలను సంసిద్ధం చేసామని ప్రకటించారు. నెల్లూరు నగరం, రూరల్ పరిధుల 54 డివిజనుల్లోని సుమారు రెండు లక్షల ముస్లిం ప్రజల సౌకర్యార్ధం రూ.22 లక్షల కార్పోరేషను నిధులతో పండుగ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేపడున్నామని ఆయన వెల్లడించారు. బారాషహీద్ ప్రాంగణంతో పాటు నగరంలోని ప్రధాన ఈద్గాలైన నజీరు తోట, బర్మాషెల్ గుంట, అహ్మద్ నగరు, వావిలేటిపాడు, దస్తగిరి నగరు, ఈద్గామిట్ట, విఆర్ కళాశాల మైదానం, జనార్ధన్ రెడ్డి కాలని ప్రాంతాల్లో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా షామియానాలు, కార్పెట్ల ఏర్పాట్లూ, పారిశుధ్యం, మంచి నీటి సౌకర్యాలను కల్పించనున్నామని ఆయన వెల్లడించారు. అదేవిధంగాపండుగ ప్రత్యేక ప్రార్ధనలకు విచ్చేసే ముస్లింలకు కార్పోరేషను ఆధ్వర్యంలో అన్ని ఈద్గా ప్రాంగణాల్లో మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. ప్రజలందరూ పరమత సహనాన్ని పాటిస్తూ, సాటి వారి పండుగలలో మమేకమై ఆదర్శ నెల్లూరు నగర నిర్మాణానికి తోడ్పడాలని మేయరు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఖాజావలి, నన్నేసాహేబ్, సిద్దిక్, బాలాజీ, హయత్, షంషుద్దీన్, సాబీర్ ఖాన్, జహీర్, ఖాసిం, గౌస్ మొహిద్దీన్, జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com