లాభాల బాటలో సింగరేణి

సింగరేణి ప్రస్తుతం లాభాల పట్టాలపై పరుగుపెడుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.వెయ్యి కోట్లకుపైగా లాభాలు సాధించిన సింగరేణి కొత్త విద్యుత్‌ కేంద్రాలలో ఈ యేడాది రికార్డు సృష్టించనుంది. సింగరేణి భారీ లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. సింగరేణి విద్యుత్‌ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ అమ్మకానికి 2016 జనవరి 18న తెలంగాణ డిస్కంతో విద్యుత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విద్యుత్‌ కేంద్రం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ 162 కిలో మీటర్ల దూరంలో ఉన్న మెదక్‌ జిల్లా గజ్వేల్‌ పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్ర నిర్మాణానికి సింగరేణి పలు ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను ప్రముఖ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీకి అప్పగించింది. ప్లాంట్‌లో ప్రధానమైన బాయిలర్‌, టర్బయిన్‌, జనరేటర్‌ (బీటీజీ) పనులను ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ బీహెచ్‌ఈఎల్‌ (భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌)కు అప్పగించింది. మిగిలిన బ్యాలెన్స్‌ ఆఫ్‌ ప్లాంట్‌ (బీఓపీ) పనుల కోసం మొక్నల్లీ భారత్‌ అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. సింగరేణి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సంస్థ సీ అండ్‌ ఎండీ తరుచూ పనులు ప్రగతిని పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించారు.పవర్‌ ప్లాంట్‌ భూ నిర్వాసితులు 800 మంది ఉంటారు. స్టీగ్‌ కంపెనీ నాన్‌పవర్‌ బాధ్యతలను పవర్‌మేక్‌ అనే మరో ప్రయివేటు కంపెనీకి అప్పగించింది. భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడానికి సింగరేణి అధికారులు 700 మంది నిర్వాసితులను గుర్తించి విడతల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తున్నారు. అయితే మూడు విడతలుగా సూమరు 250 మందిపైగా భూ నిర్వాసితులకు నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న ప్రయివేటు కంపెనీల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే నిర్వాసితులు అర్హత కలిగి ఉన్నా స్కిల్డ్‌ జాబ్స్‌ కాకుండా కేవలం అన్‌ స్కిల్డ్‌ జాబ్స్‌ మాత్రమే కల్పిస్తున్నారు. కొంత మంది నిర్వాసితులు ఐఐటీ, ఫిట్టర్‌, పాల్‌టెక్నిక్‌ డిప్లొమా, బీటెక్‌తోపాటు టెక్నికల్‌ అర్హతలు కల్గి ఉన్నప్పటికీ కేవలం అన్‌ స్కిల్డ్‌ (హౌజ్‌ కీపింగ్‌, హెల్పర్స్‌) పేరుతో లేబర్‌ పనులు చేయించారు. దీంతో విధుల్లో చేరినవారు వారం పది రోజులకే పనులు మానేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రయివేటు కంపెనీలు కాసులకు కక్కుర్తిపడి భూ నిర్వాసితులకు కష్టమైన పనులు కల్పిస్తూ ఇతర ప్రాంతాలకు చెందిన వారికి సులభమైన ఉద్యోగాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. భూములు సేకరించిన సమయంలో భూ నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం ప్రయివేటు కంపెనీకి అప్పగించి చేతులు దులుపుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఆ ప్రయివేటు కంపెనీల ప్రతినిధులు భూనిర్వాసితుల పట్ల పొమ్మనలేక పొగ బెట్టినట్టు వ్యవహరించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com