తాగునీటికి కటకట (ప్రకాశం)

జిల్లాలో తాగునీటి చెరువులు నిండుకున్నాయి. బోర్లు వట్టిపోయాయి. పథకాలు పని చేయడం లేదు. కొన్ని ఆవాస ప్రాంతాలలో ట్యాంకర్లే దిక్కు. జిల్లా కేంద్రం ఒంగోలు కార్పొరేషన్‌కూ తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. మార్కాపురం పురపాలక సంఘం వేసవి చెరువులో చుక్క నీరు లేదు. ఇదే బాటన మరికొన్ని పురపాలక సంఘాలు ఉన్నాయి. వర్షాకాలంలోనూ ఇలాంటి పరిస్థితి నెలకొనడం గమనార్హం. గ్రామాలకే కాదు .. పట్టణాలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. ఇదే పరిస్థితి మరో 15 రోజులు కొనసాగితే తాగునీటి సమస్య తీవ్రతరం కానుంది. తక్షణం సాగర్‌ నీరు విడుదల చేస్తేనే కొంతయినా ఊరట లభిస్తుంది. ఈ దిశగా ప్రజాప్రతినిధులు గట్టి కృషి చేయాల్సి ఉంది.
జిల్లాలో వర్షం జాడే లేకుండా పోయింది. జూన్‌లో -44.8 శాతం, జులైలో -43.8 శాతం వర్షపాతం నమోదైంది. ఫలితంగా నీటి వనరులు వట్టిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో చెరువులు అడుగంటిపోయాయి. పట్టణాల్లో శివారు ప్రాంతాలకు సరిగ్గా నీరు అందడం లేదు. వర్షాకాలంలోనూ ట్యాంకర్లతో నీటిని రవాణా చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ తాగునీటికి కటకటలాడే పరిస్థితి నెలకొంది. నిరంతరాయంగా 413 ఆవాస ప్రాంతాలకు రోజూ 4405 ట్రిప్పులు ట్యాంకర్లతో తాగునీటిని రవాణా చేస్తున్నారు. జిల్లాలో నోటిఫైడ్‌ చెరువులు 192 ఉంటే వాటిలో 13 చెరువుల్లో చుక్క నీరు కూడా లేదు. మిగిలిన మూడొంతుల చెరువుల్లోనూ 25 నుంచి 50 శాతం లోపు మాత్రమే నీరుంది. మొత్తం 108 నాన్‌నోటిఫైడ్‌ చెరువులుంటే 29 చెరువుల్లో పూర్తిగా నీరు అడుగంటింది. మరో 75 చెరువుల్లో సగం లోపే నీరుంది.
సాగర్‌ కాలువల ద్వారా నాలుగు టీఎంసీలు విడుదల చేసి తాగునీటి అవసరాలు తీర్చాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ రెండు పర్యాయాలు లేఖ రాసినా విడుదలకు స్పష్టమైన ఆదేశాలు లేవు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 511 అడుగుల నుంచి 520 అడుగులకు పెరిగిన తర్వాత కాలువలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ నీరు ఎప్పుడిస్తారో తేదీ ఖరారు కాలేదు. జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా చెరువులకు 0.25 టీఎంసీలు, పట్టణాల పరిధిలోని చెరువులకు 0.15 టీఎంసీలు, అద్దంకి బ్రాంచి కాలువ పరిధిలోని చెరువులకు 1.08 టీఎంసీలు, దర్శి బ్రాంచి కాలువ పరిధిలోని చెరువులకు 0.45 టీఎంసీలు, మిగిలింది ఒంగోలు బ్రాంచి కాలువల పరిధిలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ చెరువులు, పట్టణ వేసవి చెరువులకు సరఫరా చేయాలని కలెక్టర్‌ తన లేఖలో కోరారు. తాగునీటి పథకాలకు పైప్‌లైన్ల విస్తరణ, నీటి రవాణా బిల్లుల చెల్లింపు తదితర అవసరాలకూ నిధులివ్వాలని కలెక్టర్‌ ఆయా విభాగాధిపతులకు వేర్వేరుగా రాసిన లేఖల్లో కోరారు. జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చడానికి 610 బోర్లను ప్రతిపాదించారు. పీఆర్‌ మంత్రి లోకేశ్‌ను మంత్రి నారాయణ బోర్లు ఇవ్వమని అడిగారు. బోర్లు వేసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపవచ్చని ఆయన అవకాశం ఇచ్చారు. ఇక అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పట్టణాల్లోనూ తాగునీటి సమస్య జటిలమవుతోంది. ఒంగోలు నగరం పరిధిలోని వేసవి చెరువుల్లో 23 శాతమే నీరు అందుబాటులో ఉంది. ఈ నెల 18 నాటికి అడుగంటుతుంది. చీరాల 68 శాతం, కందుకూరు 62 శాతం, మార్కాపురం 17 శాతం, చీమకుర్తి 64 శాతం, అద్దంకి, కనిగిరి 27 శాతం నీరు అందుబాటులో ఉంది. గిద్దలూరులో చుక్క నీరు అందుబాటులో లేదు. ఒంగోలులో 35, చీరాల రెండు, కందుకూరు మూడు, మార్కాపురం 19, కనిగిరి 15, గిద్దలూరు 52 ఆవాసాలకు తాగునీటిని ట్యాంకర్లతో రవాణా చేస్తున్నారు. మరో రూ.37 కోట్లకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com