కత్తిరిస్తోంది (వరంగల్)

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సాగు చేసిన పంటలకు ఇప్పుడు కత్తెర పురుగు భయం పట్టుకుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో ఈ పురుగు ఉనికిని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా మొక్కజొన్నతోపాటు పత్తి, వరి వంటి పంటల్ని ఆశించే అవకాశం ఉన్నందున శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. ఈ పురుగు పంటలకు ఏదశలోనైనా ఆశించే అవకాశం ఉంది. ఒకసారి ఆశిస్తే నివారించడం కష్టంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, వరి పొలాలను పరిశీలిస్తున్నారు. వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఏరువాక కేంద్రానికి చెందిన ఇద్దరేసి శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ శాఖ ఏడీఏ, స్థానిక మండల వ్యవసాయాధికారులతో కలిపి ఐదు జిల్లాలకు వేర్వేరు బృందాలను పంపించారు.
ఇప్పటి వరకు పత్తికి ఆశించిన గులాబి రంగు పురుగుపై దృష్టి సారించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పుడు ప్రత్యేకంగా కత్తెర పురుగు ఉద్ధృతి కాకుండా రైతుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సామూహిక సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ రఘురాంరెడ్డి తెలిపారు. పంటలకు ఆశించే అన్ని పురుగులకంటే ఇది చాలా ప్రమాకరమైంది.ఈ పురుగు పంటకు ఆశిస్తే పూత, కాయల్ని తినదు. ఏకంగా మొక్కనే కొరికి తింటుంది. ఈ పురుగు ఆశించిన మొక్క నిలువునా ఎండిపోతుంది. దీంతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి పంటను ఒక్కరోజులోనే తినేంత సామర్థ్యం ఉంటుంది. కాండాన్ని కొరికి తినడంతో మొక్కచనిపోతుంది. దీనికి మొక్కజొన్న పంట అతి ప్రీతివంతమైంది.
ఈ పంట అందుబాటులో లేకుంటే పత్తి, వరి పంటలపై దాడికి దిగుతాయి. ఈ పంటలు కూడా అందుబాటులో లేకుంటే పచ్చిగడ్డిని తింటుంది. కత్తెర పురుగు మొక్కను కొరికేస్తుంది కనుక కట్‌ వార్మ్‌ అంటారు. వరి మొక్కల్ని కొరికి తింటే దిగుబడి రాదు. మొక్కజొన్న మొక్కలోకి చొరబడి లేతగా ఉంటే మొక్కని లేకుంటే మొగి లోపలికి వెళ్లి మొగినే తినేస్తుంది. దీంతో సాయంత్రం వరకు పచ్చగా కనిపించిన మొక్క మరుసటి రోజు ఉదయం ఎండిపోయి ఉంటుంది. కొని సందర్భాల్లో మొక్క కోసినట్లు నేలపై పడిపోతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
పొరుగు జిల్లాలైన మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే కత్తెర పురుగు రైతుల్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఇప్పుడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు వచ్చింది. ప్రస్తుతం దీని ఉనికి ప్రాథమిక దశలోనే ఉంది. ఇప్పుడే నివారించగలిగేలా పంటపొలాల్లో సామూహికంగా సస్యరక్షణ చర్యలు తీసుకునేలా రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com