మొక్కజొన్నపై కత్తిగట్టిన ‘కత్తెర’

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పరిధిలోని మల్లాపూర్‌లో ఫాల్ ఆర్మీవామ్ రకం పురుగు ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఈ కీటకం మొక్కజొన్న పంటను ధ్వంసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పురుగు ఏ పంటకు సోకినా నష్టం భారీగానే ఉంటుంది. పంటను కత్తిరించేస్తుందీ కీటకం. అందుకే ఫాల్ ఆర్మీవామ్‌ను కత్తెర పరుగుగానూ వ్యవహరిస్తారు. అమెరికాకు సుపరిచితమైన ఈ జీవి జగిత్యాలలో కనిపించడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంట దారుణంగా దెబ్బతింటుందేమోనని వారు భయపడుతున్నారు. ఇప్పటికే ఈ పురుగు బారినుంచి పంటను రక్షించుకునేందుకు పలు రకాల మందులు పిచికారీ చేశారు. అయినా ఫలితంలేదు. దీంతో ఏంచేయాలో తెలీక రైతులు సతమతమవుతున్నారు. ఫాల్‌ ఆర్మీవామ్‌.. శాస్త్రీయ నామం స్పోడోప్టెరా ప్రూగిపెడ్రా. ఇప్పటికే ఇది ప్రపంచ దేశాలను వణికించింది. జగిత్యాలలో ఈ పురుగు మొక్కజొన్న పంటను పీల్చి పిప్పి చేస్తుండడంతో ఆ పంట వేసిన రైతులు ఆందోళనలో కూరుకుపోయారు. 2016లో మన దేశంలోని కర్నాటక రాష్ట్రం శివమొగ్గలో మొక్కజొన్న పంటలో దీని ఆనవాళ్లు గుర్తించారు. కత్తెర పురుగు ఆనవాళ్లు మన దేశంలోని పంటల్లో ఉన్నాయా? అనే అంశంపై ఇటీవల జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. పంటలపై దీని ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
వ్యవసాయ పరిశోధన మండలి లేఖ నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి వివరాలు సేకరించారు. మల్లాపూర్‌ మండలంలో ఈ పురుగు మొక్కజొన్నను ఆశించినట్టు గుర్తించారు. పురుగులను శాస్త్రవేత్తలకు పంపించగా వాటిని పరిశీలించి కత్తెర పురుగని నిర్ధరించారు. ఈ విషయాన్ని జిల్లా వ్యసాయాధికారులు కూడా స్పష్టం చేయడంతో మొక్కజొన్న రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. వాస్తవానికి కత్తెర పురుగు మొక్కజొన్న పంటపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ పురుగు లేత మొక్కలకు రంధ్రాలు చేసి నివసిస్తుంటుంది. వాటి ఎదుగుదలను నిలిపివేస్తుంది. మక్క కంకినే కాదు, బెండును కూడా ఆర్మీ వామ్ పిప్పి చేస్తుంటుంది. ఫలితంగా దిగుబడి తగ్గి రైతులకు నష్టాలే వస్తాయి. మొక్కజొన్న పంటను ఒక్కసారి ఈ పురుగు ఆశిస్తే వదిలిపోదు. ఈ నష్టం మొక్కజొన్నతోనే ఆగిపోదు. ఈ పంట అందుబాటులో లేనప్పుడు వరి, చెరకు, కూరగాయల పంటలను ఆశించి, నాశనం చేస్తుందని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. దీంతో మొక్కజొన్న రైతుల్లోనే కాక ఇతర పంటలు పండిస్తున్న రైతులూ ఆందోళనకు గురవుతున్నారు. పంటలను దారుణంగా దెబ్బతీసే కత్తెర పురుగును సమర్ధవంతంగా నివారించడంపై వ్యవసాయాధికారులు చేయూతనివ్వాలని, ఎలాంటి మందులు వాడాలో సూచించాలని కోరుతున్నారు. కత్తెర పురుగు పగటి పూట ఆకు కాండంలో తలదాచుకొని రాత్రి సమయంలో బయటకు వచ్చి పంటపై దాడి చేస్తుంది. అందుకే ఉదయం లేదా సాయంకాలం మందులు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందని వ్యవసాయాధికారులు రైతులకు సూచిస్తున్నారు. కోరాగిన్‌ 0.3 మి.లీ.ను 4.5 మి.లీ. నీటిలో కలిపి ఎకరానికి 15 లీటర్ల మందు పిచికారీ చేస్తే కొంత ఫలితం ఉంటుందని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com