ఇసుకాసురులు

0

తుంగభద్ర నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కర్నూలు మండలంలోని మునగాలపాడు, నిడ్జూరు, జి.సింగవరం, పంచలింగాల గ్రామాల పరిధిలో తుంగభద్ర నది ప్రవహిస్తోంది. ఇక్కడ ఇసుకనిల్వలు అపారంగా ఉన్నాయి. వీటిపై అధికార పార్టీ అండతో అనుమతులు లేకుండా రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా ఇసుకను కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఒక్కో ఇసుక టిప్పర్‌ రూ.80వేల నుంచి రూ.90వేల వరకు అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారు. నది పక్కనే బళ్లారి దుర్గమ్మ దేవాలయం ఉంది. టీడీపీ నేత పొలం కూడా పక్కనే ఉండడంతో ఇసుక డంప్‌లు అక్కడే వేసుకుంటున్నారు. పొలం పక్కనే దుర్గమ్మ దేవాలయం సుమారు 7ఎకరాల్లో ఉంది. ఆ స్థలాన్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవాలయం ముందు ఇసుక డంప్‌లు వేస్తూ.. ఆలయానికి వచ్చే భక్తులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. కొందరిపై దాడులకు సైతం పాల్పడుతున్నారు.
తుంగభద్ర నదిలో 2010 సంవత్సరంలో 200 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉండేది. అక్రమ తవ్వకాలతో అది 30 క్యూబిక్‌ మీటర్లకు చేరింది. కర్నూలు నగరానికి తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర నదిలో 10 బోర్లు వేశారు. అక్రమ ఇసుక తవ్వకాలతో అందులో ఆరు బోర్లు ఎండిపోయాయి. పక్క రాష్ట్రాలకు చెందిన టిప్పర్ల యజమానులతో డీల్‌ కుదుర్చుకున్నారు. ఇక్కో ఇసుక ట్రిప్పర్‌ ధర రూ.80వేల నుంచి రూ.90వేల వరకు నిర్ణయించారు. ఇందులో రూ.40వేల కమీషన్‌ తీసుకొని మిగతాది లారీ యజమానులకు ఇస్తున్నాడు. టిప్పర్‌ సరిహద్దులు దాటించే బాధ్యత కూడా అక్రమార్కులదే. తెలంగాణ ప్రాంతం నుంచి వస్తే తిమ్మప్ప కొట్టం, పంచలింగాల స్టేజి, ఇ.తాండ్రపాడు చెక్‌పోస్ట్, పుల్లూరు చెక్‌పోస్ట్‌ వంటి వాటిని దాటించేస్తున్నారు. రోజు సుమారుగా 20 టిప్పర్లను రాష్ట్రం దాటిస్తున్నారు. బంధువుల ద్వారా ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పు రూ. 3వేల నుంచి రూ.4వేల వరకు అమ్ముతూ సంపాదిస్తున్నారు. నగరంలోని బిల్డర్స్, వెంచర్లు, బిల్డింగ్‌ల నిర్మాణం వంటి వాటికి ఇసుకను తరలిస్తున్నాడు. ట్రాక్టర్ల ద్వారా నగరంలోని ఇళ్లు, వెంచర్లకు ఇసుక తరలిస్తూ తాను చెప్పిన ధరకే ఇసుకను కొనాలని హుకుం జారీ చేస్తున్నారు.

Share.

About Author

Leave A Reply