రుయా లో అడగుడుగునా నిర్లక్ష్యం

రుయా ఆస్పత్రి తీరు నానాటికీ దిగజారుతోంది. ఆస్పత్రి గేటు నుంచి లోపలకు వెళితే.. విరిగిపోయిన స్ట్రక్చర్లు… శిథిలమైన భవనాలు ఆహ్వానం పలుకుతాయి. వాటి స్వాగతాన్ని పక్కన పెట్టి భయంభయంగానే లోపలకు వెళితే.. కానరాని సౌకర్యాలు, వెక్కిరించే వసతులు పేదోడి సహనాన్ని పరీక్షిస్తాయి. రోగులకు ఆపన్నహస్తం అందించాల్సిన ఆస్పత్రి.. ప్రయివేటు వ్యక్తుల జేబు నింపే సంస్థగా మారుతోంది. రాయలసీమలోనే పెద్ద ఆస్పత్రిగా పేరున్న రుయాను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను అందుకునేలా తయారు చేయాలని సంకల్పించింది. అందులో భాగంగా ప్రమాణాలు ఉండేందుకు అవసరం అయిన నిబంధనలను అమలుచేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్‌(ఎన్‌ఏబీహెచ్‌) పనులను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో ఎన్‌ఏబీహెచ్‌ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేసేందుకు నాలుగు నెలల క్రితం రూ.19.58 కోట్లను మంజూరు చేసింది. నిధులకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ వైద్యమౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్లను పిలిచింది.పారిశుద్ధ్యం దగ్గర నుంచి ల్యాబ్‌ పరీక్షల వరకు అన్నీ ప్రయివేటుమయమే. 1020 పడకలతో ప్రతిరోజూ 2 వేల నుంచి 2500 మంది రోగులు వివిధ జిల్లాల నుంచి వైద్యసేవల కోసం వస్తుంటారు. దాదాపు 16 విభాగాల ద్వారా రోగులకు సాధారణ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను అందిస్తోంది.రుయాలో వైద్యసేవలతో పాటు, నిర్వహణ సేవలన్నీ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ప్రయివేటు వారికి ఇచ్చే డబ్బుతో సొంత పరికరాలు… సౌకర్యాలు వచ్చేందుకు అవకాశం ఉన్నా… ఆ దిశగా ఆలోచించడం లేదు. వారు వ్యాపార తరహాలోనే వైద్యసేవలు అందిస్తున్నారు. రుయాలోని అత్యవసర విభాగం ల్యాబ్‌ను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. రాత్రి సమయంలో ఈ ల్యాబ్‌ వద్ద ఎవరూ కనిపించరు. సిటీ స్కాన్‌ అత్యవసర వైద్యవిభాగానికి ఎంతో దూరంగా ఉంది. రాత్రివేళల్లో ఏదైనా ప్రమాదం జరిగి.. సిటీస్కాన్‌ అవసరం అయితే… రోగిని మోసుకొని తీసుకెళ్లాలి. కనీసం స్ట్రక్చర్లు ఉండవు. సిటీస్కాన్‌ నిర్వాహకులు ప్రయివేటు వారే. ఆసుపత్రిలో వైద్యపరికరాల నిర్వహణ కాంట్రాక్ట్‌ను టీబీఎస్‌ సంస్థకు ఇచ్చారు. బయోమెడికల్‌ ఇంజినీర్ల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో వైద్యపరికరాలు మరమ్మతులు చేయాల్సి ఉన్నా డిప్లొమో వారితో కానిస్తున్నారు. విలువైన పరికరాలను అనర్హుల చేతిలో పెడుతున్నారు. ఇక పారిశుద్ధ్యం, ఇతర సేవలను ప్రైవేటు సంస్థలకు కేటాయించారు. భవిష్యత్తులో ఆసుపత్రి నిర్వహణ అంతా ఒక్కొక్కటిగా ప్రయివేటు వారి చేతుల్లోకి వెళ్లనున్నాయి. 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆసుపత్రి ప్రధాన భవనంతో పాటు ఇతర భవనాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రి వ్యాప్తంగా డ్రైనేజీ సమస్య నెలకొంది. రోగులకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించేందుకు అనువైన సదుపాయాలను ఆసుపత్రిలో లేవు.ఆస్పత్రి అభివృద్ధికి వచ్చిన నిధులతో ఎముకల వార్డు, జనరల్‌ సర్జరీ వార్డుల్లో పెచ్చులూడిన పైకప్పులను మరమ్మతులు నిర్వహించారు. ఆసుపత్రిలో పార్కింగ్‌ సమస్యను పరిష్కరించాలని, ఈ దిశగా ఏవైనా అనుకూలంగా షెడ్లు నిర్మించాలని అధికారులు సూచించినా పనులు కాలేదు. మురుగునీటి డ్రైనేజీ నిర్మాణం, ఆపరేషన్‌ థియేటర్‌ల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాత ఆసుపత్రిలో ఎలక్ట్రికల్‌ పనులు ఎంతో కీలకం. అక్కడ స్విచ్‌బోర్డుల దగ్గర నుంచి వైరింగ్‌ అంతా దారుణంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com