మరమ్మతులు లేక.. మూలనపడ్డాయి..

ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో సర్కారీ దవాఖానాలను పటిష్టం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే వైద్య సిబ్బంది నియామకాలు సైతం చేపట్టింది. మొత్తంగా ప్రజలకు సమర్ధవంతమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా కొన్ని ప్రాంతాల్లో నిపుణుల కొరత సమస్యాత్మకంగా మారింది. ప్రధానంగా కరీంనగర్ ప్రాంతంలో వైద్య పరికరాలు కొన్ని మూలనపడడంతో వాటి ద్వారా ప్రయోజనాలు పెద్దగా ఉండడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు అలంకారప్రాయమవుతున్నాయని పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. 16మండలాల పరిధిలో పేదలకు వైద్యసేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. కొత్త బిల్డింగ్ లు నిర్మాణం సహా హజురాబాద్‌, జమ్మికుంట ఆస్పత్రులలో పడకల పరిధి విస్తరించారు. దీంతో బడుగులకు మంచి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24గంటల పాటు సేవలందిస్తున్నాయి. ఈ ఆసుపత్రుల్లో జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 2వేల మంది రోగులు వివిధ అవసరాలకు చికిత్స కోసం వస్తున్నారు. అయితే ఇటీవల పలు రకాల వైద్య పరీక్షలు సహా సేవలకు వినియోగించాల్సిన పరికరాలు, యంత్రాలు పలు చోట్ల పనికిరాకుండా పోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి సత్వరమే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని అంతా కోరుతున్నారు.
కొన్ని ఆసుపత్రుల్లో పాడైన పరికరాలు మూలకు చేరుతున్నాయి. మరికొన్ని చోట్ల చిన్నపాటి మరమ్మతులకు నోచుకోక మొరాయిస్తున్నాయి. వీటిని బాగు చేయిస్తే ప్రయోజనం ఉంటుంది. అయితే సంబంధిత విభాగం అధికారులు వీటికి మరమ్మతులు చేయించడంపై ఉదాసీనంగా ఉంటున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఎలాగోలా వాటిని బాగు చేసేలా అధికారులు సిబ్బంది చొరవ చూపుతున్నారు. అందినంతవరకు సేవల్లో లోపాలు లేకుండా చూస్తున్నారు. యంత్రాలు పనిచేయకపోవడం వల్ల బయటకు వెళ్లే రోగికి కనిష్ఠంగా రూ.500 నుంచి2వేలకుపైగా భారం పడుతోందని బాధితులు అంటున్నారు. ప్రభుత్వాసుపత్రులను మెరుగు పర్చేందుకు కోట్లాది రూపాయల్ని వెచ్చించడంతోపాటు అవసరమైన పరికరాల కొనుగోలుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా నిధుల్ని వెచ్చించింది. జాతీయ ఆరోగ్యమిషన్‌ నిధులు సహా ఇతర నిధులతో వీటిని ఆయా ఆస్పత్రిలకు సమకూర్చారు. ఇలా జిల్లాలోని అన్ని ఆస్పత్రులకు రూ.40కోట్ల వరకు వీటి కోసం ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. నిత్యం వ్యాధుల నిర్ధరణ సహా కీలకమైన పరీక్షలకు వాడే యంత్రాల రూపంలోనే సిబ్బందికి సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల ఈ పరికరాల ద్వారా సేవలు నిలిచిపోతుండడంతో రోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పలు ఆసుపత్రుల్లో మూలనపడ్డ పరికరాలను బాగుచేయించి.. వినియోగంలోకి తీసుకురావాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com