రాహదారి కష్టాలకు త్వరలోనే విముక్తి

ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా నిర్మల్. జిల్లా అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తున్నా.. రోడ్ల పరిస్థితి మాత్రం పెద్దగా బాగుపడలేదు. ప్రస్తుతం వానాకాలం కావడంతో.. పలు రహదారులు చిత్తడిగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రాకపోకలు నరకప్రాయంగా ఉంటున్నాయి. ఈ సమస్యను తొలగించేందుకు సర్కార్ చర్యలసు తీసుకుంటోంది. బీటీ రోడ్ల కోసం నిధులు మంజూరు చేసింది. నిర్మల్ జిల్లాకే కాక ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేయించేందుకు, కొత్త రోడ్లు వేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేనట్లు సమాచారం. దీంతో ఈ గ్రామాల్లోని గిరిజనం రాకపోకలకు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను ప్రజాప్రతినిధులను అర్ధిస్తూనే ఉన్నారు. సరైన రోడ్లు లేకపోవడంతో ఆ పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని గుర్తించిన అధికారులు ఎట్టకేలకు స్పందించారు. రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 250 గ్రామాలను కలుపుతూ 60 బీటీ రహదారుల నిర్మించాలని నిర్ణయించారు.
రహదారి సమస్యలతో మారుమూల గ్రామాల్లోని గిరిజనులు పడుతున్న సమస్యలను ప్రత్యక్షంగా చూశారు స్థానిక ఎమ్మెల్యేలు. రోడ్లు అత్యవసరమని.. అంతేకాక వీటిని సత్వరమే నిర్మించాలని గుర్తించారు. ఈ ఆవశ్యకతను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించుకోవడంలో విజయవంతమయ్యారు. వారి కృషి ఫలితంగా ప్రభుత్వం స్పందించి గిరిజన ఉపప్రణాళిక నిధులతో బీటీ రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రామాల రోడ్ల సమస్య కొలిక్కి రానుంది. గిరిజన పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ మేరకు గిరిజన ఉపప్రణాళిక కింద రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రూ.91.46 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అధ్వానంగా మారిన రహదారులకు మరమ్మతులు చేసి బీటీ రోడ్లు వేసేందుకు అవసరమైన ప్రణాళికను ఉట్నూరు ఐటీడీఏ ఇంజినీరింగ్‌శాఖ సిద్ధం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *