కాంగ్రెస్ తో కలిసేందుకు సై….

చంద్రబాబు క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అవసరమైతే కాంగ్రెసుతో కలిసేందుకు సైతం ఆయన సిద్ధం. జాతీయ స్థాయిలో మరోసారి తమనేత కీలక పాత్ర పోషిస్తారని టీడీపీ ప్రచారం ప్రారంభించింది. కేంద్రాన్ని అన్నివైపుల నుంచి కార్నర్ చేయడానికి బాబు ప్రయత్నిస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందామా..? వద్దా..? అసలు ఎన్నికలు సింగిల్‌గా వెళ్లాలా..? పొత్తు పెట్టుకోవాలా..? అనే అంశంపై నిశిత చర్చ జరిగింది. సుమారు గంటకుపైగా ఈ కీలక చర్చ జరిగింది. హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్‌తో ఎలా వ్యవహరించాలి..? వారితో ఎలా ముందుకెళ్లాలన్న తీరుపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారు. కాగా.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని సంకేతాలున్నాయి. ఈ విషయాన్ని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పొత్తు విషయంలో తెలంగాణ నేతల అభిప్రాయాన్ని తీసుకోవాలని పార్టీలోని కొందరు ముఖ్యులను చంద్రబాబు ఆదేశించారు.కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులుంటేనే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు బాబుకు స్పష్టంగా వివరించినట్లుగా తెలుస్తోంది. గతంలో పోల్చుకుంటే ఏపీలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత తగ్గిందని నేతలు సీఎంకు వివరించారని సమాచారం. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావం తగ్గుతోందని నేతలు ప్రభావం తగ్గుతోందన్న ప్రస్తావన కూడా సమావేశంలో చర్చించారని సమాచారం. వీటన్నింటినీ విన్న సీఎం చంద్రబాబు త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుందామని నేతలతో బాబు చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉంటే… గత కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నట్లు మెలిగిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ మద్దతు, కర్ణాటక సీఎం కుమార స్వామి ప్రమాణ స్వీకారంలో రాహుల్‌‌తో కలయిక, నారా బ్రాహ్మణి రాహుల్‌ భేటీలో ప్రత్యక్ష మవ్వడం ఈ సందర్భాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకుంటే ముందు నుంచే చంద్రబాబు దాదాపు ఫిక్సయ్యారనే తెలుస్తోంది. అందుకే గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని ఇట్లే అర్థం చేసుకోవచ్చు.కేరళ ప్రకృతి విపత్తుల వంటి సంఘటనను సైతం వదలలేదు. కేంద్రం వివక్ష పాటిస్తోందంటూ విరుచుకుపడ్డారు. మోడీ సర్కారును ఎదుర్కొనే ‘హీ మేన్’ గా తనను తాను ప్రొజెక్టు చేసుకోవడంలో భాగమే ఇదంతా. మోడీ, అమిత్ షా ద్వయానికి రాహుల్ గాంధీ సహజమైన ప్రత్యర్థి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడు. అనుభవ లేమి, అందర్నీ కలుపుకుని పోగల సామర్ధ్యం కాంగ్రెసు అధినేతకు లోపించింది. అందువల్ల కాంగ్రెసు కూటమి నేతగా రాహుల్ ఉంటే తమ పని సులభమని మోడీ, షా భావించారు. క్రమేపీ మరో ప్రత్యర్థిగా అనుభవజ్ఝనుడైన చంద్రబాబు రూపుదాల్చడం వారికి మింగుడుపడటం లేదు. ఆయనను రాజకీయంగా నియంత్రించే ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నట్లుగా హస్తిన సమాచారం.పశ్చిమబంగలో తిరుగులేని నాయకురాలిగా వెలిగిపోతున్న మమతా బెనర్జీ ప్రత్యర్థిగా మారతారనే ఆందోళన మొదట్లో కమల నాథులకు ఉండేది. పశ్చిమబంగ పెద్ద రాష్ట్రం కావడానికి తోడు దూకుడు కల నాయకురాలిగా మమతకున్న క్రేజ్ వేరు. అంతేకాకుండా ముస్లిం మైనారిటీ ఓట్లను దేశవ్యాప్తంగా ఆకర్షించగల శక్తి ఆమెకుంది. దానివల్ల ఏ కూటమికైనా నాయకత్వం వహిస్తే కొంత అడ్వాంటేజీ ఉంటుందని తృణమూల్ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే మమతకుండే సహజ చంచలత్వం తమకు కలిసివస్తుందని కమలనాథులు లోపల్లోపలే సంతోషించారు. మోడీని తీవ్రంగా వ్యతిరేకించడమనే ఒకే ఒక అంశం కారణంగా ఆమెకు ఫెడరల్, సెక్యులర్ ఫ్రంట్ కు నాయకత్వం అప్పగించడం నష్టదాయకమని విపక్షాలు గ్రహించాయి. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నాయకురాలు మాయావతి కూడా ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. దేశంలో 15 శాతం పైగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆమె పీఎం అభ్యర్థిగా కూటమి కడితే కలిసివస్తుందనే ఆలోచన సాగింది. ఎస్పీ, బీఎస్పీల పొత్తులో భాగంగా అఖిలేష్ ను ముఖ్యమంత్రిత్వానికి పరిమితం చేసి తాను జాతీయ పాత్రకు వెళ్లాలని ఆమె యోచించారు. కానీ మాయావతికి నాయకత్వ పరమైన సమస్యలున్నాయి. ఆమె రంగంలోకి దిగితే హిందూ ఓటు బీజేపీవైపు పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో మమత, మాయావతి, రాహుల్ ఎవరైనా తమకు పెద్దగా నష్టం చేయలేరని బీజేపీ అంచనా వేసింది. మూడు నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు పిక్చర్ లోకి రావడంతో మోడీ, అమిత్ షా కొంత కలవరపాటుకు గురయ్యారు. జాతీయ స్థాయిలో ఆయనకున్న పరిచయాలు, అనుసంధానకర్తగా గతంలో నిర్వహించిన పాత్ర ఇందుకు కారణం. అందులోనూ కాంగ్రెసుకు సైతం ఆమోదయోగ్యమైన వ్యక్తిగా చంద్రబాబు రూపుదాల్చడం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ప్రాంతీయ పార్టీలతో చంద్రబాబుకు మంచి ఈక్వేషన్ ఉంది. తమిళనాడులోని డీఎంకే, ఏఐఏడీఎంకే రెండు పక్షాలతో సత్సంబంధాలున్నాయి. ఏఐఏడీఎంకే ను ప్రస్తుతం బీజేపీ శాసిస్తోంది. డీఎంకే కాంగ్రెసుకు మిత్రపక్షంగా ఉండటం చంద్రబాబుకు కలిసొచ్చే అంశం. ఆ పార్టీ అధినేత స్టాలిన్ రాష్ట్రరాజకీయాలకే పరిమితం. అందువల్ల నేషనల్ పిక్చర్ లో చంద్రబాబును సమర్థించడానికి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు. కర్ణాటకలోని దేవెగౌడ, కుమారస్వామి మద్దతు సైతం చంద్రబాబు కూడగట్టగలరనే భయం బీజేపీకి ఉంది. నవీన్ పట్నాయక్ వంటి వాళ్లు ఎలాగూ గోడమీద పిల్లివాటమే ప్రదర్శిస్తున్నారు. దీనిని సానుకూలం చేసుకోగల రాజకీయ నైపుణ్యం తెలుగుదేశం అధ్యక్షునికి ఉంది. అఖిలేష్ వంటివారితోనూ సంబంధాలు బాగున్నాయి. శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే వంటివారు కూడా చంద్రబాబు నాయుడు సీన్ లోకి వస్తే కాదనరు. ఇవన్నీ కలిసొచ్చే అంశాలే.ఒకవేళ తమిళనాడు పాలిటిక్స్ లో డీఎంకే, ఏఐఏడీఎంకే లకు ప్రత్యర్థిగా రజనీకాంత్ రంగంలోకి దిగితే చంద్రబాబు జాక్ పాట్ కొట్టినట్లే. చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడంలో రజనీకాంత్ పాత్ర పోషించారు. లక్ష్మీపార్వతిని దూరం పెట్టాలంటూ ఎన్టీయార్ తో 1995లో రాయబారం నడిపిన వారిలో రజనీ కీలకమైన వ్యక్తి. 2019 ఎన్నికలకు ఆయన రూపంలో అదృష్టం కలిసివస్తే టీడీపీకి అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు. ప్రాంతీయ ఫ్రంట్ ను బలంగా రూపుదిద్దడానికి రజనీ వంటి గ్లామర్ స్టార్ ప్రత్యేక ఆకర్షణ అవుతారు. అందువల్ల తలైవా పార్టీ వెంటనే రంగంలోకి దిగాలని టీడీపీ కోరుకుంటోంది. అయితే రజనీకాంత్ కు మోడీతో కూడా మంచి ఈక్వేషనే ఉంది. కానీ మొగ్గు ఎటువైపు అన్నదే ముఖ్యం. మోడీ వర్సస్ చంద్రబాబు అన్న భావన బలంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తే బలాబలాల్లో కొంత మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాంగ్రెసు తన ప్రాధాన్యాన్ని కుదించుకోవాల్సి ఉంటుంది. అసలు ఇటువంటి భావనే రాకుండా చంద్రబాబును నిరోధించడం ఎలా అన్న కోణంలో ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com