సింగరేణికి వాన దెబ్బ

శనివారం నుంచి కురుస్తున్న వర్షాల ఎఫెక్ట్ భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణిపై పడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో బొగ్గు ఉత్పత్తి సాగలేదు. ఉభయ జిల్లాల్లోనూ ఇదే దుస్థితి నెలకొన్నట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. శని, ఆది, సోమవారాల్లోనే సుమారు 4లక్షల 67వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్ పనులు సాగలేదని అంటున్నారు. వర్షాల వల్ల అనుకున్నంతమేర బొగ్గు తవ్వకం సాధ్యపడలేదని వివరించారు. జూన్, జులై మొదటి వారాల్లోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పుడు కురిసిన భారీ వర్షాల ధాటికి గనులు నిర్మానుష్యమయ్యాయి. కొత్తగూడెం ప్రాంతంలో రోజుకు జీకే ఉపరితల గనిలో 10 వేల టన్నుల బొగ్గు ఉత్తత్తి జరుగుతుంది. కానీ భారీ వర్షాలు ఈ పనులకు బ్రేక్ వేశాయి. ఓబీ పనులకూ అడ్డంకులు ఏర్పడ్డాయి. 47 వేల క్యూబిక్‌ మీటర్ల ఓబీ తీయాల్సి ఉండగా పనులు జరగకపోవడంతో 1 లక్షల 88 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా ఓబీ ఆగింది. ఉత్పత్తి లేక గతంలో వెలికి తీసిన బొగ్గును మాత్రం రవాణా చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.
కొత్తగూడెంతో పాటూ మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి ఏరియాల్లోనూ బొగ్గు తవ్వకాలు ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లోని ఉపరిత గనుల్లో నాలుగు రోజులపాటు 2.10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సింగరేణి వర్గాలు తెలిపాయి. బొగ్గుతోపాటు 18.68 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర ఓబీ(ఓవర్‌ బర్డన్‌) వెలికితీత పనులు ఆగిపోయినట్లు సమాచారం. ఉభయ జిల్లాల్లోని నాలుగు సింగరేణి ఏరియాలలో రోజుకి 61 వేలు టన్నుల బొగ్గు ఉత్పత్తి సాగాలి. అయితే భారీ వర్షాల వల్ల పనులు సజావుగా సాగలేదు. రెండు రోజులుగా అతి భారీ వర్షాలతో గనుల్లో పనులు నిలిచి నిర్మానుష్యంగా మారాయని అధికారులు చెప్తున్నారు. మణుగూరు ఏరియాలోని మూడు ఉపరితల గనుల నుంచి రోజుకు 17 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటుంది. ల్లెందు ఏరియాలో జేకే ఓసీ, కేవోసీ రెండు ఉపరితల గనుల నుంచి రోజుకు 14 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 80 వేల క్యూబిక్‌ మీటర్ల ఓబీని వెలికి తీయాల్సి ఉంది. రోజుకి జేకే ఓసీలో 8 వేల టన్నులు, కేవోసీ గనిలో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇక సత్తుపల్లి ఏరియాలో ఉన్న జేవీఆర్‌ ఉపరితల గనిలో రోజుకి 20 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అయితే ప్రస్తుత వానల ధాటికి రోజూవారీ షెడ్యూల్ దెబ్బతింది. నిర్దేశిత పరిమాణం మేరకు బొగ్గు తవ్వకాలు సాగలేదు. వర్షం తగ్గినప్పుడు పనులు చేస్తూ బొగ్గు ఉత్పత్తి సాగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com