వానల్..వరదల్..

అధిక వర్షపాతం ఆదిలాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. పది రోజుల క్రితం వరకూ చినుకులేక అల్లాడిపోయిన జిల్లా.. ఎడతెరిపి వానలతో తడిసిముద్దైంది. అయితే ఈ వానల ధాటికి వరద పోటెత్తింది. వరదనీరు ఇళ్లల్లోకి, పొలాల్లోకి చేరడంతో ప్రజలు, రైతులు నానాకష్టాలు పడుతున్నారు. మంగళవారం వాన బెడద తగ్గినా.. తిష్టవేసిన వరద నీరు మాత్రం.. అలాగే నిలిచి ఉంది. ఈ సమస్య మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలే అధికం. నీరు ఇంకిపోయేందుకు మరికొన్ని రోజులు పడుతుంది. మొదట్లో వర్షాలు రైతులు, ప్రజలకు ఊరటనే ఇచ్చాయి. పొలాలకు నీరు అందుతుందని అన్నదాతలు.. నీటి కటకట తప్పుతుందని అంతా అనుకున్నారు. ఈ ఎఫెక్ట్ కు భూగర్భ జలాల మట్టాలు పెరుగుతాయని నిపుణులు సైతం హర్షం వ్యక్తంచేశారు. అయితే.. చినుకు భీకరరూపం దాల్చి వరదలా మారింది. పలు ప్రాంతాలను ముంచెత్తింది. వారం రోజులుగా కురుస్తున్న వరుస వర్షాలతో జిల్లాలో ఎటుచూసినా నీరే కనిపిస్తున్న పరిస్థితి. వాన జోరందుకోవడంతో వాగులు, వంకలు, చెరువులు, నదుల్లోకి వరద నీరు భారీగా చేరింది. సోమవారం ఉదయానికైతే జిల్లాలో 25.9 మిమీల వర్షం రికార్డైంది. ఇంద్రవెల్లిలో 82.4 మిమీలు, ఉట్నూర్‌లో 77.2 మిమీల వర్షం నమోదు అయింది. ఇక నార్నూర్‌, నేరడిగొండ, ఇచ్చోడ, ఆదిలాబాద్‌, సిరికొండ, జైనథ్‌, బేల తదితర మండలానూ భారీ వర్షం కుదిపేసింది. భారీ వర్షాలకు జిల్లాలోని పలు వాగులు, నదుల ప్రవాహం పెరిగిపోయింది. నీరు పొంగిపొర్లడంతో సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల గృహాల్లోకీ వరద నీరు చేరింది.

పంటలు నష్టపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 1.23 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో పత్తి పంట 96వేల ఎకరాలు ఉండగా, సోయా 19వేల ఎకరాలు ఉంది. అ తరువాత కంది పంటకు నష్టం వాటిల్లింది. ఇదిలాఉంటే వరుస వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు వానల్లేక వెలవెలబోయిన జలాశయాలు ప్రస్తుతం నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షాలతో జిల్లాలోని అన్ని జలాశయాలకూ జలకళ వచ్చింది. దాదాపు ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికేనే పలు సార్లు గేట్లు తెరిచి వరద నీటిని వదిలారు. ఇక జిల్లా సరిహద్దులోని పెన్‌గంగ నది నిండుగా ఉంది. వాగులు నదిలో కలుస్తుండడంతో పెన్ గంగ పరవళ్లు తొక్కుతోంది. వానల ఉధృతికి వరదలు పోటెత్తడంతో అధికారులు జిల్లాలో పలు ప్రాంతాల్లో పునరావాస ఏర్పాట్లు చేశారు. సుమారు 3,900 మంది నిరాశ్రయులైనట్లు అధికారులు గుర్తించారు. వీరి కోసం దాదాపు 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com