నాణ్యతకు తిలోదకాలు (శ్రీకాకుళం)

తోటపల్లి జలాశయం చుట్టూ చేపట్టిన ఏపని చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత తీసికట్టుగా మారింది. ఇక్కడి మట్టికట్ట బలహీనతకు చిరునామాగా మారుతోంది. మట్టికట్టపై ఎక్కడా ప్రమాణాలు పాటించలేదని ఇంజినీరింగు నిఫుణులు చెబుతున్నారు. గట్టును పూర్తిస్థాయిలో మెరుగుపరచలేదు. గట్టుపై పడిన వర్షపు నీరు కిందికి జారిపోయేందుకు వీలుగా గట్టుపై సిమెంటు దోనెలు నిర్మిస్తారు. ఈదోనెలు శిధిలమవుతున్నాయి. ఇవి పాడైపోవడంతో.. వర్షపునీరు నేరుగా బయటకు పోకుండా మట్టికట్టలో వర్షపునీరు ఇంకి బలహీనంగా మారుతుంది. మట్టికట్టకు ఒకవైపు రాతికట్టు, మరో వైపు మట్టి కోతకు గురికాకుండా ఉండేందుకు పచ్చికను పెంచాలి. పచ్చిక అక్కడక్కడ కనిపిస్తుంది. సాధారణంగా మొక్కలు, చెట్టు ఎక్కడా పెరగనీయకూడదు. కానీ తోటపల్లి గట్టుపై మొక్కలు, చెట్లు విస్తృతంగా పెరుగుతున్నాయి. దీంతో మట్టికట్ట పూర్తిగా బలహీనంగా మారే ప్రమాదం ఉంది.
మట్టికట్ట కిందికి దిగేందుకు కొన్ని చోట్ల మెట్లును నిర్మించారు. మట్టికట్ట వదులుగా ఉండి, ఎక్కడికక్కడ జారిపోతుండడంతో… ఈమెట్లు కూడా కూలిపోతున్నాయి. బ్యారేజీ పక్కనే నిర్మించిన గట్లు పూర్తిగా శిధిలమయ్యాయి. ఇక్కడి పనులే ఇలా ఉంటే.. అసలు మనుషులు దృష్టే లేని చోట్ల నిర్మాణాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మట్టికట్ట అనుకున్నంత బలంగా లేదనే విమర్శలు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటి పరిస్థితి చూస్తుంటే. ఆవిమర్శలకు బలం చేకూర్చినట్లవుతుంది.
ప్రస్తుతం ఉన్న జలాశయానికి రక్షణ కరువయ్యింది. వందేళ్ల కిందట నిర్మించిన రెగ్యులేటరును తొలగిస్తే తప్ప జలాశయానికి రక్షణ లేదని జలవనరులశాఖ సాంకేతిక సలహాదారులు తేల్చి చెప్పారు. రెగ్యులేటరును కూల్చేసి.. బెడ్‌లెవెల్‌ 92 అడుగులకు నదీ గర్భాన్ని సరిచేయాల్సి ఉంది. కానీ రెగ్యులేటరు తీసేసినా.. 92 అడుగుల స్థాయిలో స్థిరీకరణ జరగలేదు. దీంతో జలాశయం నుంచి నదిలోనికి విడిచిపెట్టిన నీరు.. తన ఇష్టం వచ్చిన దారిని వెతుక్కొంటోంది. ఫలితంగా కుడివైపు నది ఒడ్డు కోతకు గురవుతోంది. ఇది క్రమంగా విస్తరించుకుంటుంది. దీంతో నది తన గమనాన్ని, దారిని మార్చుకుంటుంది. జలాశయం నుంచి వేలాది క్యూసెక్కుల నీరు ఒక్క ఉదుటన నదిలోనికి వస్తుండటంతో నదికి రెండువైపులా ఒడ్లు కోతకు గురవుతున్నాయి. రెగ్యులేటరును పూర్తిస్థాయిలో తొలగించకపోవడం పెద్ద తప్పిదమైతే… 92 అడుగుల స్థాయికి నదీ గర్భాన్ని తీసుకువచ్చి నీరు స్వేచ్ఛగా పోయేందుకు అవకాశం ఇవ్వకపోవడం మరోతప్పుగా కనిపిస్తుంది. ఈరెండింటి కారణంగా నది నడకలో మార్పువచ్చింది.
రెగ్యులేటరుగా ఉన్న సమయంలో నీటినిల్వ చేసే ప్రాంతంలో నదికి రెండువైపులా రాతికట్ట ఉండేది. ముఖ్యంగా ఎడమ వైపు రాతికట్ట మరింత బలంగా ఉండేది. వరద నీరు కారణంగా ఇప్పుడు అది పూర్తిగా కొట్టుకుపోయింది. స్పిల్‌వే రెగ్యులేటరుకు ఎడమ వైపు చాలా లోతు వరకు రాతి జాడ కనిపించకపోవడంతో ప్రాంతంలో సిమెంటు కాంక్రీటు వేసి నిర్మాణాలు చేపట్టారు. జలాశయం నుంచి నీరు బయటకు విడిచిపెట్టే సమయంలో ఒత్తిడి పెరిగిపోయి.. ఇప్పుడు రాతిబండలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. క్రమంగా కాంక్రీటు నిర్మాణంపై ఒత్తిడి పెరిగి జలాశయానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈపరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడా చర్యలు కనిపించడంలేదు. జలాశయాన్ని పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలంటే.. విడిచిపెట్టే నీరు స్వేచ్ఛగా వెళ్లేందుకు దారిచూపాల్సిన అవసరం ఉంది.
తోటపల్లి పాత ఆయకట్టుకు సాగునీరు అందించేకు జలాయశం స్పిల్‌వే రెగ్యులేటరు వద్ద మదుము నిర్మించారు. ఇది అతుకులమయంగా ఉంది. గోడలు ఒకదానికి ఒకటి సంబంధం లేనట్లుగా విడిపోతున్నాయి. ఇప్పటికే ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లుగా ఉన్న గోడలు.. రానున్న కాలంలో పూర్తిగా విడివడేలా ఉన్నాయి. గోడలు అతికే సమయంలో ఒకదానితో ఒకటి అనుసంధానించే రీతిలో నిర్మాణాలు చేయకపోవడం వల్లే.. ఇలా బీటలు వస్తుంటాయని ఇంజినీర్లు చెబుతున్నారు. కొద్దిగా సాంకేతికంగా ఆలోచిస్తే.. ఇటువంటి వాటిని అధిగమించొచ్చునని విశ్రాంత ఇంజినీరు ఒకరు చెప్పారు. కానీ వీటిని పట్టించుకోకపోవడం వల్లే ఇలా బీటలు వారుతున్నాయని, ఇది భవిష్యత్తులో మట్టికట్టకు ఇబ్బంది కలిగిస్తుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *