ప్రభుత్వకళాశాల విద్యార్ధులకు నాణ్యమైన విద్య

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, టెక్నికల్ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.
సోమవారం సచివాలయంలో విద్యాశాఖ పై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ డా.ఎ.అశోక్, విద్యాశాఖ అధికారులు ఎ.కృష్ణారావు, ఎ.సత్యనారాయణరెడ్డి, రమణ కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,67,752 మంది విద్యార్ధులు వివిధ కోర్సులలో విద్యనభ్యసిస్తున్నారన్నారు. జూనియర్ కళాశాలలో భవనాలు, ఆటస్ధలాలు అదనపు తరగతి గదులను కూడా నిర్మిస్తున్నామన్నారు. 2014-15 నుండి ఇప్పటివరకు 152 కోట్లతో సౌకర్యాలు కల్పించామన్నారు. మరో 106 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాల సాధనకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ను ప్రారంభించామన్నారు. డిగ్రీ కళాశాలలకు సంబంధించి దోస్త్ ద్వారా ఆన్ లైన్ అడ్మిషన్లు నిర్వహించామని తెలిపారు. సాంకేతిక విద్యకు సంబంధించి 823 విద్యా సంస్ధలు ఉన్నాయని, పాలిసెట్ అడ్మిషన్లు జరిపామని, 169 కోట్లతో సాంకేతిక కళాశాలల్లో సివిల్ పనులు చేపడతున్నామన్నారు. వివిధ యూనివర్సిటీలలో నాణ్యమైన విద్యతోపాటు ఉపాధి కల్పించే కోర్సులను ప్రారంభించాలన్నారు. యూనివర్సిటీలకు న్యాక్ అక్రిడిటేషన్, కొత్త కోర్సుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధమిక పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *