సమస్యలతో సావాసం

వర్షాకాలంలో సీజనల్ ఫీవర్స్ విజృంభిస్తుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యాధులకు లోనవుతుంటారు ప్రజలు. ఇక పరిసరాల పరిశుభ్రత సరిగా లేకుంటే అంతే సంగతులు. దోమలు, క్రిమికీటకాదులు విస్తరించి ప్రజారోగ్యంపై దాడి చేస్తుంటాయి. అందుకే ఈ కాలంలో పరిసరాలు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని వైద్య నిపుణులు సైతం స్పష్టంచేస్తుంటారు. ఇదిలాఉంటే.. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ పరిధి గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నట్లు సమాచారం. జిల్లాలోని అన్ని మేజర్‌ పంచాయతీలతో పాటు నూతనంగా ఏర్పడిన పంచాయతీల్లో సైతం పారిశుద్ధ్య కార్మికుల సేవలు నిలిచిపోయాయని ప్రజలు వాపోతున్నారు. కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్తు సమస్యలు ఏర్పడి నానాపాట్లు పడుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల, ఉద్యోగుల డిమాండ్‌లను నెరవేర్చాలని చేపట్టిన నిరవధిక సమ్మె రోజురోజుకు పట్టుబిగుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పడి ఉంది. ఫలితంగా ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత నెల 23వ తేదీ నుంచి కార్మికులు తమ విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టినప్పటికీ ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్‌ జిల్లాలోని 17 మండలాల్లోని 467 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు, కారోబార్‌లు, పంపు ఆపరేటర్‌లు, సహాయకులు మొత్తం 622 మంది పనులు చేస్తున్నారు. రెండు వారాలుగా కార్మికులంతా సమ్మెలో ఉన్నారు. దీంతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. గ్రామాల్లోని వీధులు, మురుగు కాలువలు దుర్గంధభరితమయ్యాయి. ప్రతి రోజూ ఉదయాన్నే రోడ్లు, మురుగు కాలువలను శుభ్రం చేసే కార్మికులు లేకపోవడంతో సమస్యాత్మకంగా మారింది. గ్రామాల్లో శుభ్రం చేసే వారు లేక అంతర్గత రహదారులు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. వర్షాకాలం కావడంతో మురుగు కాలువల్లో బ్లీచింగ్‌ చేయాల్సి ఉంది. కానీ ఆ పనులు సజావుగా సాగడంలేదు. ఫలితంగా కాలువలు చెత్తతో పేరుకుపోయాయి. దోమలకు ఆవాసాలుగా నిలిచాయి. పలు గ్రామాల్లో వీధి దీపాలు సైతం వెలగక పోవడంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. 15 రోజులకు ఒక సారి మంచినీటి పథకాల్లో క్లోరినేషన్‌ చేయాల్సి ఉండగా పనులు జరగాలి. అదీ జరగడం లేదని స్థానికులు విరుచుకుపడుతున్నారు. మొత్తంగా గ్రామాల్లో తిష్టవేసిన పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత విభాగం ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అంతా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com