సమస్యలే గుర్తింపుకు అడ్డంకి!

రిమ్స్ వైద్యకళాశాల ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజల వైద్య అవసరాలు తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇలాంటి హాస్పిటల్‌కు ఎంసీఐ గుర్తింపు లభించలేదు. దీంతో వైద్యశాల ఉన్నతాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే భారత విద్యామండలి గుర్తింపుకు రిమ్స్ దూరమైందని పలువురు అంటున్నారు. సిబ్బంది అంతర్గత పోరుతో ఆసుపత్రి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభివృద్ధి విషయాన్ని ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అత్యున్నతస్థాయి అధికారులు సైతం ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపైన దృష్టి సారించడంలేదని ఫలితంగా హాస్పిటల్ నిర్లక్ష్యానికి గురవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇక్కడ పనిచేస్తున్న పలువురు వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసులు కొనసాగిస్తున్నారు. ఇది కూడా కొంత ఇబ్బందిగా మారిందని పలువురు అంటున్నారు. ఎంసీఐకు చెందిన బృందం ఇటీవలే ఆదిలాబాద్‌లోని రిమ్స్‌, నిజామాబాద్‌లో ప్రభుత్వ వైద్యకళాశాలను ఎంసీఐ తనిఖీ చేసింది. దేశవ్యాప్తంగా తనిఖీ జరిగిన కళాశాలల్లో అన్నింటికంటే అత్యధికంగా 22లోపాలు రిమ్స్‌లోనే ఉన్నట్లు తేల్చింది.

ఎంసీఐ టీమ్ తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూశాయి. ప్రధానంగా ఇక్కడ పనిచేస్తున్న వైద్యుల్లో 80.64శాతం మంది స్థానికంగా ఉండటంలేదని తేలింది. వైద్యుల్లో కొందరు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఇక రిమ్స్‌ ఆసుపత్రిలో పడకల ఆక్యుపెన్సీ 52.97 శాతం మాత్రమే ఉన్నట్లు పరిశీలనలో తేలింది. వాస్తవానికి ఉమ్మడిజిల్లా వైద్య అవసరాలకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్‌కు రోజూ రెండువేలకు పైగానే బయట రోగులు వస్తుంటారు. ఇక హాస్పిటల్‌లోనే ఇన్ పేషెంట్లుగా ఉండేవారూ ఎక్కువే. ఇంతటి కీలక హాస్పిటల్‌లో వైద్య సిబ్బంది కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు వైద్యులంతా సొంతంగా ప్రైవేటు క్లినిక్‌లు పెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి. వీరు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై పెట్టిన శ్రద్ధ సర్కారీ దవాఖానాలో సేవలందించడంపై పెట్టడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. అంతేకాక వైద్యుల రాకపోకలు సక్రమంగా లేవన్న విమర్శలున్నాయి. పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పలువురు రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్‌కే వెళ్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏదైమైనా రిమ్స్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ఎంసీఐ గుర్తింపుకు తగ్గట్లుగా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాసంక్షేమే ధ్యేయంగా చెప్పుకునే ప్రభుత్వ లక్ష్యం నీరుగార్చవద్దని విజ్ఞప్తిచేస్తున్నారు. అందరికీ సమర్ధవంతమైన వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com