ఇంకా కోతల కాలమే.. (కరీంనగర్)

కోతల వెతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎడాపెడా నిలుస్తున్న సరఫరాతో వినియోగదారులు అల్లాడుతున్నారు. అభివృద్ధి పనుల పేరిట అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రణాళిక లోపం.. విద్యుత్తు సంబంధిత పనుల్లో కనిపించని వేగం.. వెరసి అంతా అంధకారంగా మారుతోంది. ఆయా ప్రాంతాల్లో అప్రకటిత కోతల వాత ఇబ్బందుల్ని సృష్టిస్తోంది.
వాతావరణం చల్లబడింది. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. విద్యుత్తు వినియోగం తగ్గింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి కోతల్లేని నిరంతర విద్యుత్తును అందివ్వాల్సిన పట్టణంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతినిత్యం పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలో కచ్చితంగా కోతలు అమలవుతున్నాయి. ఏకబిగిన గంటల తరబడి ఎదురవుతున్న అంతరాయంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వేసవిలోనే ఎడాపెడా నిలిచిన సరఫరాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మండుటెండల కాలాన్ని మించేలా ఇంకా కోతల తీవ్రతను సంబంధిత అధికారులు పెంచేస్తున్నారు. పట్టణంలో కొనసాగుతున్న ఐపీడీఎస్‌ పనుల్ని నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలనే సాకుతో ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్నారు. వినియోగదారుల అవస్థలతో సంబంధం లేకుండా రోజంతా సరఫరాను నిలిపేస్తున్నారు. ఫీడర్లు, ఇతర నిర్వహణ పనుల్లో జాప్యం పేరిట గంటల తరబడి విద్యుత్తు సరఫరా ఉండటంలేదు.
ఇంకా ఎన్నిరోజులు.. ఈ పనులు..? అనేలా పట్టణంలో ఐపీడీఎస్‌ పనుల్లో నగరంలో విపరీతమైన ఆలస్యం కనిపిస్తోంది. రోజులో ఎంతలేదన్నా కనిష్ఠంగా ఆరుగంటలు గరిష్ఠంగా 9 గంటల పాటు కోతల్ని విధిస్తున్నారు. పని తక్కువ.. కోతలు ఎక్కువ అనేలా ఆయా కాలనీల్లో పరిస్థితి కనిపిస్తోంది. మరమ్మతులు సహా వ్యవస్థ మార్పులో భాగంగా తీగల్ని అమర్చడానికి గంటపాటు ముందగానే సరఫరాను నిలిపివేస్తున్నారు. పని విరామం సహా ఇతర సమయాల్లోనూ కోతలను అమలు చేస్తున్నారు. పని జరిగే ప్రాంతాలతో పాటు జరగని చాలా ప్రాంతాలకు ఇక్కట్లు తప్పడంలేదు. మరోవైపు ఈ ఏడాది అక్టోబరు నాటికి ఈ పనులన్నింటిని పూర్తి చేయాలనే నెపంతో వేసవి కాలానికి మించి ఎక్కువ గంటలపాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నారు. రూ.29 కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో భాగంగా 33/11కేవీ విద్యుత్తు తీగల్ని అమర్చే విషయంలో నింపాదిగానే ప్రగతి కనిపిస్తుంది. ఇప్పటికే చేపట్టినవి కాకుండా చేపట్టాల్సిన 38.69 కి.మీ మేర వేయాల్సిన తీగలకుగాను ఇప్పటి వరకు 22.50 కి.మీ మేర వేశారు. ఇంకా 16.19 కి.మీ పనుల జాడే లేదు. ఇక 11 కేవీ తీగల మార్పులో 32.89 కి.మీకు గాను పురోగతి కనిపిస్తోంది.. ఎల్టీ తీగలను అమర్చడంలో 25 కి.మీకు గాను 19 కి.మీ పూర్తయ్యాయి. ఎక్కువ సమయాన్ని తీసుకునే పెద్దవైన ఇనుప స్తంభాలను అమర్చే విషయంలో జాప్యం జరుగుతోంది. మొత్తంగా 584 స్తంభాలకుగాను 497 పూర్తయ్యాయి. మరో 87 నిర్మించాల్సి ఉంది. నిర్ణీత కాలంలో పనులు జరగాలంటే ఎక్కువ మొత్తంలో కార్మికుల్ని వినియోగించడం.. ఏకకాలంలో పనులన్నీ చకచకా జరిగేలా పర్యవేక్షించడంలాంటి చర్యల్ని అధికారులు చేపట్టాలి. కానీ ఈ తీరులో ఆశించిన మార్పు కనిపించకపోవడంతోపాటు పనుల పర్యవేక్షణలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో రెండు గంటల పనికోసం నాలుగు గంటల కోతలు పట్టణ వాసులకు తప్పట్లేదు.!
అసలే వానాకాలంలో తరచూ విద్యుత్తు అంతరాయం వాటిల్లుతుంది. అక్కడక్కడా లోపాలతో తరచూ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనికితోడుగా సరఫరా నిలిపివేసే ప్రాంతాలు, కోతల సమయంపై సంబంధిత అధికారులు ముందస్తు సమాచారాన్ని ఇవ్వడంలేదు. దండోరా వేయించడం లేదా ప్రత్యేకంగా అమర్చిన మైకు సాయంతో ప్రకటించడం, పత్రికల్లో విషయం ఉండేలా చూడాల్సిన విద్యుత్తు అధికారులు తమకు పట్టదనేలా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడుగా ఇటీవలే విద్యుత్తు శాఖలో అన్ని స్థాయిలో అధికారులు బదిలీ అవడం సమస్యను పెంచింది. దీంతో నిర్ణీత కోతల వేళలు సహా అప్రకటిత కోతల విషయంలో అధికారులు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. పనులున్న ప్రాంతాలు కాకుండా సమీపంలోని ఇతర ప్రాంతాలకు ఇబ్బంది కలిగేలా ఫీడర్ల వారీగా సరఫరాను నిలిపివేస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్తు లేకపోవడంతో గృహాల్లోని వారు సహా వ్యాపార సముదాయాలు, చిరువ్యాపారులు అయోమయంలో పడుతున్నారు. పోయిన విద్యుత్తు ఎప్పుడు వస్తుందోనని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి నిత్యం కొన్ని కాలనీలకు ఎదురవుతోంది. ఇక విద్యుత్తు పునరుద్ధరణ విషయమై సంబంధిత అధికారుల నుంచి వినియోగదారులకు సరైన స్పందన కరవవుతోందని ఆయా కాలనీల ప్రజలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా మారడం, ఇప్పుడే పనుల కోసం కోతలు పెరగడంతో ఏమి చేయాలి..? ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com