యథేచ్ఛగా ఆక్రమణలు

అక్రమార్కుల ఆగడాలకు చారిత్రాత్మక చెరువులు రూపు కోల్పోతున్నట్లు నల్గొండ జిల్లాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా లింగగిరిలో పురాతన చెరువులు మాయమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొందరైతే చెరువులను ఆక్రమించుకుని సాగు భూములుగానూ మలచుకున్నారని ఆరోపిస్తున్నారు. హుజూర్‌నగర్‌ మండలం లింగగిరిలోని పెద్ద చెరువు ఆక్రమణలకు గురైనట్లు పలువురు అంటున్నారు. వాస్తవానికి ఈ చెరువు సర్వే నంబర్‌ 524. దీని విస్తీర్ణం 243.40 ఎకరాలుగా ఉంది. ఇక ఈ చెరువును కొందరు ఆక్రమించుకోవడంతో పాటూ స్థలంలో సాగు చేసేందుకు చెరువులోని మట్టితో హద్దు పెట్టుకున్నారు. చెరువులోకి నీళ్లు వచ్చినా పంటకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ఏర్పాటుచేసుకున్నారు. మరికొందరైతే ఇళ్ల స్థలాలుగా విక్రయించే ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ఎకరాకు రూ.3లక్షల చొప్పున బేరం పెడుతున్నట్లు స్థానికులు అంటున్నారు. ఇంకొందరు ఈ స్థలాలను ఇళ్ల నిర్మాణానికి కేటాయించుకున్నట్లు కర్రలు పాతారు. ఈ దందా పరిశీలిస్తే దాదాపు 100 ఎకరాల మేర ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది.

చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు చాలాచోట్ల ఇతరులకు విక్రయిస్తుంటారు. రిజిస్ట్రేషన్‌ ఉండకపోయినా కొందరు వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక్కడా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. చెరువులోనే బావులు తవ్వుకుని సాగు చేసుకుంటున్న వారూ ఉన్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఎకరాకు రూ.3లక్షల చొప్పున రెండెకరాలను విక్రయించారు. మిషన్‌ కాకతీయలో పెద్ద చెరువులో మరమ్మతులు చేశారు. అయినా ఆక్రమణల జోలికి వెళ్లలేదు. సర్వే నంబర్‌ 569లో మరో చెరువు ఉంది. దీని విస్తీర్ణం 119.47 ఎకరాలు. అయితే ఈ చెరువుకు సంబంధించి 40.30 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు సమాచారం. ఈ చెరువులోనూ 12 బావులు తవ్వి కొందరు సాగు చేసుకుంటున్నారు. ఇష్టానుసారంగా ఆక్రమణలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులెవరూ పట్టించుకోకపోవటం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పంది ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని, చెరువులను పునరుద్ధరించాలని అంతా కోరుతున్నారు. స్థానికంగా మేజర్ నీటి వనరులైన ఈ చెరువులు ధ్వంసం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com