అనూహ్యంగా పట్టుబడ్డ మోసగాళ్లు

Faceless Computer Hacker

ఓ ఆర్మీ అధికారిని మోసం చేసిన కేసులో సైబర్‌ నేరగాళ్లు అనూమ్యంగా పట్టుబడ్డారు. వారిని అరెస్ట చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు పట్టుకున్న ఓ నిందితుడికి స్నేహం కొద్దీ బెయిల్‌ ఇచ్చేందుకు వచ్చిన దిల్లీ సైబర్‌ నేరస్థులు నాటకీయంగా పోలీసులకు దొరికిపోయారు. అనుకోని అతిథుల్లా వచ్చిన ముగ్గురు నేరస్థులను పోలీస్‌ అధికారులు వెంటనే పట్టుకుని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుందీ ఘటన. హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆర్మీ మాజీ అధికారి విఠల్‌ మోహన్‌ రావును పర్యాటక ప్రాంతాలకు పంపిస్తానంటూ దిల్లీకి చెందిన సైబర్‌ నేరస్థుడు సుమిత్‌ మాలిక్‌ మోసం చేసి రూ.29 లక్షలు స్వాహా చేశాడు. సుమిత్‌ మాలిక్‌ మోసం చేసి స్వాహా చేసిన రూ.29 లక్షలను తిరిగి ఇప్పిస్తామంటూ మరో ముగ్గురు సైబర్‌ నేరస్థులు ప్రదీప్‌ ప్రసాద్‌, అభిషేక్‌, ఆత్మాదేవ్‌సింగ్‌… మాయచేసి విఠల్‌ మోహన్‌రావు దగ్గర మరో రూ.87 లక్షలు దోచుకున్నారు. టర్కీ విహార యాత్ర పేరుతో తన నుంచి రూ.1.16 కోట్ల నగదును మోసపూరితంగా కాజేశారంటూ విఠల్‌ మోహన్‌రావు సైబర్‌ కైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కె.వి.ఎం. ప్రసాద్‌ వారం క్రితం దిల్లీకి వెళ్లి సుమిత్‌ మాలిక్‌ను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలించారు. సుమిత్‌ మాలిక్‌ జైల్లో ఉంటున్నాడని తెలుసుకున్న స్నేహితులు అతడికి బెయిల్‌ ఇప్పించి, దిల్లీకి తీసుకువెళ్లాలని న్యాయవాది సహా దిల్లీ నుంచి విమానంలో బుధవారం ఉదయం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వచ్చారు. సుమిత్‌ మాలిక్‌ను కోర్టుకు తీసుకొచ్చిన ఒక పోలీస్‌ అధికారికి ప్రదీప్‌ ప్రసాద్‌ను చూడగానే అనుమానం వచ్చింది. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ కె.వి.ఎం.ప్రసాద్‌కు విషయాన్ని వివరించగా… ఎస్సైలు, కానిస్టేబుళ్లు సహా వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లకుండానే… ఆర్మీ మాజీ అధికారిని మోసం చేసిన ప్రదీప్‌ ప్రసాద్‌, అభిషేక్‌, ఆత్మాదేవ్‌ సింగ్‌ల ఆచూకీని సైబర్‌ కైం పోలీస్‌ అధికారులు గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో దిల్లీకి వెళ్లి వారి కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్‌ చేయాలని అనుకున్నారు. దిల్లీకి వెళ్లే ప్రత్యేక బృందాన్నీ సిద్ధం చేశారు. ఈలోగానే ముగ్గురు నేరస్థులు హైదరాబాద్‌ కోర్టు ప్రాంగణంలో వారిని కొద్దిసేపు స్వేచ్ఛగా ఉండనిచ్చి తర్వాత పోలీస్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో తమను ఎవరు గుర్తిస్తారన్న ధైర్యంతోనే వీరు అత్యుత్సాహంతో వచ్చుంటారని నిందితులను పట్టుకున్న పోలీసులు తెలిపారు. కోర్టు ప్రాంగణంలోనే అరెస్ట్‌ చేసినందున వారిని విచారించే సమయం లభించలేదని, మరిన్ని వివరాలు వారి నుంచి సేకరించేందుకు కస్టడీ పిటిషన్‌ వేయనున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com