ప్లేట్ లెట్స్ దందా.. (విజయనగరం)

జిల్లా వ్యాప్తంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇందులో చాలావరకు ప్లేట్‌లెట్లు పడిపోతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నెలలో జిల్లాలోని పలు రక్తనిధి వైద్యశాలలు 1500 వరకు ప్లేట్‌లెట్లు బ్యాగులు అందించారంటే కనీసం 300 మంది వరకైనా బాధితులు ఉంటారని అంచనా. అయినా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం డెంగీ లక్షణాల కేసులు పదుల సంఖ్యలోనే చూపుతోంది. వీరి వద్ద ఉన్న సమాచారానికి, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు.
జ్వరాల నిర్దారణే ఓ సందేహంలా మారింది. వచ్చింది డెంగీ జ్వరమా..? లేక మరొకటా.. అని నిర్దారించే వ్యవస్థ కేవలం ప్రభుత్వ పరిధిలో కేంద్ర ఆసుపత్రిలోనే ఉంది. ప్రైవేటులో అవకాశం లేదు. అయితే డెంగీ అనే పదం నేరుగా వాడకుండా చాలా మంది పడిపోతున్న ప్లేట్‌లెట్ల్లను సాకుగా చూపించి చికిత్స అందిస్తున్నారు. దీన్నే డెంగీగా భావిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సమాచారం వైద్యఆరోగ్య శాఖ దగ్గర ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఎవరైనా చనిపోతే ఫలానా సమస్యతో చనిపోయారని చెబుతారు. అయితే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయినా సరే కారణాన్ని వెల్లడించలేని పరిస్థితిలో వైద్యఆరోగ్య శాఖ ఉంది. ఎక్కడ మలేరియా, డెంగీ, అతిసారం, టైఫాయిడ్‌, విష జ్వరంతో చనిపోయారని ప్రకటిస్తే లేనిపోని సమస్య వస్తుందేమోనన్న ఉద్దేశంతో ఆయా లక్షణాలతోనే చనిపోయారు తప్ప.. అదే కారణమని చెప్పలేమని తప్పించుకుంటున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం చూచాయగా ఆ రోగం ఏమిటో బాధితులకు చెబుతున్నట్లు సమాచారం.
రోగం బారిన పడిన వ్యక్తులు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుంటే.. వారి బంధువులు ప్లేట్‌లెట్లు కోసం రక్తనిధి వైద్యశాలల వద్ద బారులు తీరుతున్నారు. అప్పటికప్పుడు సేకరించిన రక్తం ద్వారానే ప్లేట్‌లెట్లు సేకరించాల్సి ఉంటుంది. నిల్వ చేసి ఉంచిన వాటిని ఇవ్వడానికి లేదు. దీంతో రక్తదాతల గిరాకీ పెరిగిపోయింది. జిల్లాలో కేంద్ర ఆసుపత్రి, ఎన్‌వీఎన్‌, మిమ్స్‌ ఆసుపత్రుల్లో రక్తనిధి వైద్యశాలలు ఉన్నాయి. వీటిలో అధికంగా ఎన్‌వీఎన్‌ రక్తనిధిశాల నుంచి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. రక్తదాతను తీసుకొని వెళ్తే రూ.500లకు ప్లేట్‌లెట్లు బ్యాగ్‌ను ఇస్తున్నారు. రక్తదాత లేకుంటే రూ.800 వరకు తీసుకుంటున్నారు. కేంద్ర ఆసుపత్రిలో మాత్రం ఆ ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి మాత్రమే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదీ రక్తదాతను తీసుకొని వచ్చి రూ.200 చెల్లిస్తేనే.
సాధారణంగా ప్లేట్‌లెట్లు ప్రతి మనిషిలో 1.50 లక్షల వరకు ఉంటాయి. ఇవి 30 వేల వరకు తగ్గినా పర్వాలేదని ప్రభుత్వ వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం కొంత తగ్గినా వెంటనే ఎక్కించాలని చెప్పి భయపెట్టేస్తున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. 70 వేలు, 60 వేలు ఉన్నా సరే ఎక్కించాల్సి వస్తుందని అలా ప్లేట్‌లెట్ల కోసమే సుమారు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందులు, ఆసుపత్రి ఖర్చులు కలుపుకుంటే రూ.50వేలకు పైనే అవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే రోగికి ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల వరకు పడిపోతేనే ప్రాధాన్యత కేసుగా తీసుకొని ఎక్కిస్తున్నట్లు వైద్యులు అంటున్నారు. అప్పటి వరకు ప్లూయిడ్స్‌, పండ్ల రసాలు, ఇతరత్ర మందుల ద్వారా ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తే ప్రధానంగా బొండపల్లి, డెంకాడ, విజయనగరం, తెర్లాం, జామి, నెల్లిమర్ల, భోగాపురం, దత్తిరాజేరు మండలాల్లో డెంగీ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. వీటిలో డెంకాడలో ఇటీవల కాలంలో అయిదు వరకు కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఇంకా చాలా ఉంటాయని వైద్య వర్గాల్లో కింది స్థాయి ఉద్యోగులే చెబుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com