గాలి..కల్తీ..

సూర్యాపేట జిల్లాలో పలు పెట్రోల్ బంకుల్లో అవకతవకలు సాగుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. కల్తీ, తూకంలో మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు నష్టపోతున్నారని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే పెట్రోలు బంకుల నిర్వాహకులు యంత్రాలు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు.. చేర్పులు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. స్క్రీన్‌పై అంతా బాగున్నట్లే కనిపించినా. పోసే విధానంలోనే కిరికిరి ఉంటోందని పలువురు అంటున్నారు. మోసాలు జరిగే బంకుల్లో.. పంపులో నుంచి ముందుగా గాలి వస్తుందని చెప్తున్నారు. గాలి వస్తున్న విషయం వినియోగదారుడికి తెలీదు. ఎందుకంటే డీజిల్ లేదా పెట్రోల్ ట్యాంకులో పడుతున్నట్లే అంతా భావిస్తారు. పైగా మీటర్‌ సాధారణంగా తిరుగుతుంది కాబట్టి ఈ డౌట్ రాదు. అయితే ఇంధనం మాత్రం వాహనంలో పడదు. కొన్నిసార్లు మనం ఫోన్‌లో మాట్లాడుతూనో.. పరధ్యానంగా ఉంటేనో రీడింగ్‌ను జీరోకు మార్చకుండానే పోస్తున్నారని కొందరు వాహనదారులు అంటున్నారు. గాలితో వాహనదారులను ఏమార్చుతున్న ఘటన ఇటీవలే నల్గొండలో వెలుగు చూసింది. ఈ ఉదంతంపై విచారణ విస్తృతం చేయగా సూర్యపేటలోనూ మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ తరహా తంతు సాగిపోతున్నట్లు తేలింది.

సమన్వయ లోపం..తూనికలు కొలతలు, పౌర సరఫరాలశాఖతో పాటు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌ బంకులను పర్యవేక్షిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలందించాల్సి ఉంది. ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు చేపట్టడం లేదు. తూకాలు, కొలతలు, వినియోగదారుల సౌకర్యాలు, పెట్రోలు కల్తీపై నిరంతరం దృష్టి పెట్టాల్సి ఉండగా చర్యలు నామమాత్రమే అని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 256 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. నిత్యం సుమారు 2.10 లక్షల లీటర్ల పెట్రోలు, 6.20 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగం ఉంటుంది. ఇదే అదనుగా పలు ప్రాంతాల్లో బంక్‌ నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోవడంలేదు. ఇక ఉల్లంఘనలైతే కోకొల్లలు. కొలతల్లో తేడా, కల్తీలకు తోడు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో రోజువారి మార్పులు చేయాల్సి వస్తోంది. తగ్గిన రోజుల్లో అందుకు తగ్గట్లు మార్చడంలేదు. ఫలితంగా వినియోగదారులు నష్టపోతున్నారు. ఇలా పక్కదారి పడుతున్న డబ్బు రోజుకు రూ.లక్షల్లోనే ఉంటుందని అంచనా. ఇదంతా నిర్వాహకుల జేబుల్లోకే వెళ్తోంది. మరికొన్ని పెట్రోల్‌ బంకుల్లో జీరో చేయకుండానే ఇంధనాన్ని నింపుతున్నారు. కల్తీతో పాటు కొలతల్లోనూ తేడాలు ఉన్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు దాడులు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ఈ దందా యథేచ్ఛగా సాగిపోతోందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్టవేయాలని వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com