ధ్వజారోహణంతో వైభవంగా శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మూత్సవాలు ప్రారంభం

0
padmavathi-karthika-bramhostavalu-apduniaశ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.45 గంటలకు వృశ్చిక లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి శ్రీపి.శ్రీనివాసన్‌ కంకణభట్టర్‌గా వ్యవహరించారు.
ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన  కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.
 
ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
Share.

Comments are closed.